మసూద్ అజహర్ ను ఉగ్రవాదిగా ప్రకటించడంపై ఈయూ సమావేశం

మసూద్ అజహర్ ను ఉగ్రవాదిగా ప్రకటించడంపై ఈయూ సమావేశం

జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ను ఉగ్రవాదిగా ప్రకటించేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) సమావేశమైందని జర్మన్ రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభమైందని, 28 సభ్యదేశాలను ఒప్పించి ఏకాభిప్రాయం సాధించేందుకు మరికొంత సమయం పట్టవచ్చని చెబుతున్నారు. గత వారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సీ)లో మసూద్ అజహర్ ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న తీర్మానాన్ని బలపరిచిన కీలక దేశాల్లో జర్మనీ ఒకటి. యూరోపియన్ యూనియన్ లో మసూద్ ని ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని అంటోంది.

మసూద్ అజహర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాలన్న తీర్మానాన్ని యుఎన్ఎస్సీలో చైనా అడ్డుకున్న కొద్దిరోజులకే యూరప్ అంతటా మసూద్ అజహర్ ను బ్లాక్ లిస్ట్ చేయాలన్న తీర్మానం ప్రారంభమైంది. గత వారం ఐక్యరాజ్య సమితిలో ఈ తీర్మానాన్ని ప్రస్తావించిన ఫ్రాన్స్, తమ దేశంలో జైషే చీఫ్ ను నిషేధించింది. అతని ఆస్తులను స్థంభింపజేసింది. ఉగ్రవాదంలో హస్తం ఉన్న వ్యక్తుల జాబితాలో అజహర్ ను చేర్చాలని 'ఇతర యూరోపియన్ భాగస్వాముల దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని' ఎమాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం తెలిపింది. 

ఐరాసలో అమెరికా, యుకె, ఫ్రాన్స్ లు ప్రవేశపెట్టిన తీర్మానానికి పలు దేశాలు మద్దతు తెలిపాయి. కానీ భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా తన శాశ్వత మిత్రుడు పాకిస్థాన్ కోసం మసూద్ అజహర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడాన్ని అడ్డుకుంది. 2009, 2016లలో కూడా చైనా భారత్ తీర్మానానికి మోకాలడ్డింది.