క్లారిటీ ఇచ్చిన కడియం..

క్లారిటీ ఇచ్చిన కడియం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహించిన కడియం శ్రీహరికి.. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో అకలబూనిన కడియం శ్రీహరి.. భారతీయ జనతా పార్టీ గూటికి చేరడం ఖాయమంటూ వార్తలు వచ్చాయి. తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించిన బీజేపీ.. ఇతర పార్టీల్లోని కీలక నేతలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కడియం కూడా బీజేపీ చేరతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి... తాను బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండిస్తూ బహిరంగ లేఖ రాశారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు కథనాలు రాయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తి చేసిన కడియం.. సదరు వార్తా సంస్థలు బహిరంగ క్షమాపణ తెలపాలని లేఖలో పేర్కొన్నారు. లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తన లేఖలో హెచ్చరించారు కడియం. 

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలవబోతోందని, కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతానని, తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని కడియం స్పష్టం చేశారు. అలాగే తాను అంబేద్కర్ వాదినని, లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చిన వ్యక్తిగా బీజేపీతో సైద్ధాంతికంగా విబేధిస్తానని కడియం లేఖలో పేర్కొన్నారు. పదవుల కోసం పాకులాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు కడియం.