ఆ మాజీ డీజీపీకి కీలక పదవీ... అసలు కారణం ఇదేనా..?
వైసీపీ అధికారంలోకి వచ్చాక లూప్లైన్లోకి వెళ్లారు. రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉంటారని ఆ IPS గురించి పదే పదే చర్చించుకున్నారు. ఏమైందో ఏమో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేశారు. కీలక పోస్ట్ పట్టేశారు. ఇంతకీ ఎవరా IPS? ఆయన విషయంలో ఏం జరిగింది?
అప్పట్లో డీజీపీగా ఉన్న ఠాకూర్‌పై వైసీపీ ఫైర్!
గత ప్రభుత్వంలో డీజీపీగా పనిచేశారు RP ఠాకూర్. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే లూప్లైన్లోకి వెళ్లిపోయారు. దీనికి కారణం లేకపోలేదు. విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి ఘటన సందర్భంగా ఠాకూర్ వ్యవహరించిన తీరు నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి రుచించలేదు. ఆ ఘటనపై విచారణ జరగకముందే దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తగా ప్రకటించారు ఠాకూర్. అప్పట్లో చంద్రబాబు ఏం చెబితే అదే డీజీపీ హోదాలో ఠాకూర్ చెబుతున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు.
వైసీపీ అధికారంలోకి రాగానే ఠాకూర్ బదిలీ!
సాధారణంగా ఉన్నతస్థాయి అధికారుల్లో చాలామంది ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా వ్యవహరిస్తారు. ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న ఠాకూర్.. తమను అణగదొక్కేందుకు ప్రయత్నించారని వైసీపీ ఆరోపించింది. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు రావడం.. అధికారం చేపట్టడంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికారుల బదిలీలలో ఫస్ట్ స్ట్రోక్ పోలీస్ బాస్‌పైనే పడింది. డీజీపీగా ఉన్న ఠాకూర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా బదిలీ అయ్యారు. రిటైరయ్యే వరకు ఆయన మెయిన్ లైన్లోకి వచ్చే అవకాశమే ఉండదని పోలీస్ వర్గాలు భావించాయి. అలాంటిది APS ఆర్టీసీ ఎండీగా ఠాకూర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్.
ఆర్టీసీ ఎండీగా ఠాకూర్ నియామకంపై చర్చ!
ఈ అనూహ్య బదిలీపై అధికార, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరగుతోంది. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన సాయిప్రసాద్, సతీష్‌చంద్ర వంటి అధికారులు కూడా తిరిగి కీలక బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పుడు ఠాకూర్ వంతు వచ్చిందని అనే వారు కూడా ఉన్నారు. ఠాకూర్ మరో మూడు నాలుగు నెలల్లో రిటైర్ అవుతున్నారు. పదవీ విరమణ చేసే సమయంలో కీలక పోస్టుల్లో ఉండాలని అధికారులు కోరుకుంటారు. అందుకే ఒకటిరెండుసార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి.. ఆ సమయంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వచ్చింది తప్ప.. జగన్‌పట్ల కానీ.. వైసీపీ మీద కానీ వ్యక్తిగతంగా ఎలాంటి విరోధభావం లేదని వివరణ ఇచ్చారట. ఇటు ప్రభుత్వం కూడా అధికారుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు వాస్తవం కాదని చెప్పే ప్రయత్నం చేసిందని టాక్. అయితే ఠాకూర్ మళ్లీ లైమ్ లైట్లోకి రావడానికి నార్త్ ఇండియా లాబీ పనిచేసిందనే ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా.. డిజీపీగా పనిచేసిన అధికారి ఒక్కసారిగా తెరమరుగై.. ఇప్పుడు కీలక పోస్టులోకి రావడం చర్చగా మారింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)