గుత్తా సుఖేందర్ రెడ్డి పై మండిపడ్డ మాజీ మంత్రి

గుత్తా సుఖేందర్ రెడ్డి పై మండిపడ్డ మాజీ మంత్రి

టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మాకు కాదు కేసీఆర్ ఇచ్చిన షాక్ కు గుత్తాకు మతిభ్రమించిందని ఆరోపించారు. అందుకే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియడం లేదని అన్నారు. మంత్రి పదవి ఇస్తానని, ఎంపీగా, ఎమ్మెల్సీగా గెలిపిస్తానని కేసీఆర్ సరైన గుణపాఠమే చెప్పాడని ఎద్దేవా చేశారు. బెడ్ రూమ్ లోకి వెళ్లిన తరువాత కేసీఆర్ ను తిడుతున్నావ్.. బయట మమ్మల్నీ తిడుతున్నావని మండిపడ్డారు. మాకు పదవులపై కోరిక ఉంటే మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేస్తామని ప్రశ్నించారు. సమాచార హక్కు కింద లెటర్లు పెట్టి సిమెంట్ ఫ్యాక్టరీ యజమానులను బెదిరించి వేల కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపించారు. ఆ డబ్బుతోనే వేలాది ఎకరాలు కొన్నాడని మండిపడ్డారు. నీ తమ్ముడిని డైరీ చైర్మెన్ గా చేసి 30 ఏళ్లు దోచుకుతింటున్న నీచమైన చరిత్ర గుత్తా సుఖేందర్ రెడ్డిదని అన్నారు. రాజశేఖర్ రెడ్డితో మాట్లాడి నా దయ వల్ల ఎంపీగా గెలిచి పార్టీలు మారాడని తెలిపారు. దేశంలో మూడు పార్టీలు మారి ఎంపీగా ఉన్న మొదటి వ్యక్తి గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రమే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అవ్వబోతుందంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మతిస్థిమితం లేకుండా మాట్లాడడం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సర్వసాధారణమై పోయిందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయ జీవితం చివరి అంకంలో ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్  కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు ప్రస్తుతం అనామకులుగా మారారని విమర్శించారు. కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టే ధైర్యం కూడా చెయ్యలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు.