వంద నదుల్లో వాజ్ పాయి అస్ధికల నిమజ్జనం

వంద నదుల్లో వాజ్ పాయి అస్ధికల నిమజ్జనం

భారత రత్న, దివంగత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అస్థికలను దేశంలోని వంద నదుల్లో నిమజ్జనం చేయాలని బీజేపీ నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు తమ రాష్ట్రాల్లో అస్థికలతో అస్ధి కలశ్ యాత్ర నిర్వహించి అనంతరం నదుల్లో నిమజ్జనం చేయాలని పిలుపు నిచ్చింది. ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు వాజ్ పేయి అస్ధికలను ఉంచిన పాత్రలను అందచేశారు. పార్టీ నేతలు తమ రాష్ట్ర రాజధాని నగరం నుంచి యాత్ర ప్రారంభించి ఇతర ప్రాంతాల గుండా యాత్ర చేయాలని, వాజ్‌పేయీకి నివాళుర్పించే అవకాశం ప్రజలందరికీ కల్పించాలని అమిత్ షా తెలిపారు. యాత్ర అనంతరం పలు నదుల్లో అస్థికలు నిమజ్జనం చేయాలని సూచించారు. మరోవైపు దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు వాజ్‌పేయీకి నివాళిగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. 

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అస్థికల కలశం హైదరాబాద్ చేరుకోగానే శంషాబాద్ విమానాశ్రయం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజల సందర్శనార్ధం రెండురోజుల పాటు వాజ్‌పేయి అస్థికల కలశంను రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం కృష్ణా, గోదావరి, మూసీ, తుంగభద్ర నదుల్లో అస్ధికలను నిమజ్జనం చేయనున్నారు. మరోవైపు ఏపీ రాజధానికి చేరుకున్న వాజ్ పేయి అస్థికల కలశాన్ని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గన్నవరం విమానాశ్రయంలో అందుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పార్టీ నాయకులు రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ అధ్యక్షుడు కన్నా, ఎంపీ జి.వి.యల్. నరసింహారావు, పురందరేశ్వరి, విష్ణుకుమార్ రాజు, గోకరాజు గంగరాజు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం రెండు గంటల వరకు పార్టీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్ధం ఉంచి సాయంత్రం 4 గంటలకు పున్నమి ఘాట్ లో అస్ధికలను నిమజ్జనం చేయనున్నారు.