ట్రంప్ ఆన్ లైన్ పోల్ రిగ్గింగ్ చేయమని చెప్పారు

ట్రంప్ ఆన్ లైన్ పోల్ రిగ్గింగ్ చేయమని చెప్పారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ లాయర్ మైకెల్ కోహెన్ గురువారం ఓ బాంబు పేల్చారు. తనకు ప్రయోజనం చేకూర్చేలా ఆన్ లైన్ పోలింగ్ డేటాను రిగ్గింగ్ చేయాలన్న ట్రంప్ సూచన మేరకు తాను ఓ సంస్థకు డబ్బు ఇచ్చానని తెలిపారు. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిపిన రెండు ప్రజాభిప్రాయ సేకరణ పోల్స్ ను ట్రంప్ కు అనుకూలంగా చూపేందుకు కోహెన్ రెడ్ ఫించ్ సొల్యూషన్స్ అనే డేటా సంస్థకు డబ్బు చెల్లించినట్టు ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

గురువారం కోహెన్ తన ట్విట్టర్ లో ‘పోల్ రిగ్గింగ్ పై వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం గురించి చెబుతున్నాను. నేను చేసిందంతా డొనాల్డ్ ట్రంప్ సూచనల మేరకే ఆయనకు ప్రయోజనం చేకూర్చేందుకే అలా చేశాను. నా గుడ్డి విధేయతకు నేను చాలా చింతిస్తున్నాను. ఆయన అందుకు అర్హుడు కాడు’ అని ట్వీట్ చేశారు. రిపబ్లికన్ అభ్యర్థులను ఎంపిక చేసే డ్రడ్జ్ రిపోర్ట్ పోల్ లో ట్రంప్ కి పదేపదే ఓటు పడేలా కంప్యూటర్ స్క్రిప్ట్ రాయాలని రెడ్ ఫించ్ సొల్యూషన్స్ నడిపే జాన్ గేజర్ ను ఫిబ్రవరి 2015లో కోహెన్ నియమించినట్టు జర్నల్ తెలిపింది. 2016 అధ్యక్ష ఎన్నికలలో దిగేందుకు అప్పుడే ట్రంప్ సన్నద్ధం అవుతున్నారని వార్తాపత్రిక పేర్కొంది.

పోల్స్ ను ప్రభావితం చేసే ప్రయత్నాలు చివరకు విజయవంతం కాలేదు. డ్రడ్జ్ రిపోర్ట్ పోల్ లో 24,000 ఓట్లు లేదా 5% ఓటింగ్ తో ట్రంప్ ఐదో స్థానంలో నిలిచారు. కానీ ట్రంప్ ప్రచారంలో ఉపయోగించిన వ్యూహాలు, వాటి అమలులో కోహెన్ పాత్ర వెలుగు చూశాయి. ప్రచార సమయంలో తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకొనేందుకు ట్రంప్ తరచుగా తన పోలింగ్ సంఖ్యలను ప్రస్తావించారు.

ట్రంప్ గురించి మాట్లాడకుండా ఉండేందుకు మహిళలకు రహస్యంగా డబ్బు ముట్టజెప్పడం, రష్యాలో నిర్మించ తలపెట్టిన ట్రంప్ టవర్ ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ కు అబద్ధాలు చెప్పిన నేరాలపై గత నెల కోహెన్ కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. 2014లో దేశంలోని టాప్ బిజినెస్ లీడర్లను గుర్తించేందుకు సీఎన్బీసీ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ ని కూడా ఇలాగే రిగ్గింగ్ చేసేందుకు కోహెన్ గేజర్ ను నియమించారు. అప్పుడు ట్రంప్ టాప్ 100 అభ్యర్థుల్లో లేరని వాల్ స్ట్రీట్ తెలిపింది.