జాదవ్ పూర్ బీజేపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న 'ద గ్రేట్ ఖలీ'

జాదవ్ పూర్ బీజేపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న 'ద గ్రేట్ ఖలీ'

డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్ స్టార్ రెజ్లర్ ద గ్రేట్ ఖలీ శుక్రవారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాకు వచ్చాడు. లోక్ సభ ఎన్నికల్లో జాదవ్ పూర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన మిత్రుడు అనుపమ్ హాజ్రా నామినేషన్ వేస్తున్నపుడు పక్కనే నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్ రెజ్లర్, నటుడు అయిన దలీప్ సింగ్ రాణా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈ కీలకమైన రోజున తన స్నేహితుడితో ఉండాలని భావించాడు. వీలైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

మొన్నటి వరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ బోల్ పూర్ ఎంపీగా ఉన్న హాజ్రా ఇటీవలే కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై ఈ జనవరిలో అనుపమ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. వెంటనే ఆయన మార్చిలో కమలం పార్టీలో చేరిపోయారు. 

జాదవ్ పూర్ లో తృణమూల్ అభ్యర్థి, సుప్రసిద్ధ బెంగాలీ నటి మిమీ చక్రబొర్తితో హాజ్రా తలపడుతున్నారు. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ మిమీ చక్రబొర్తి తన అందచందాలతో జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అయితే నరేంద్ర మోడీ వేవ్ తో తను విజయం సాధించడం ఖాయమని హాజ్రా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖలీని తీసుకురావడంతో నియోజకవర్గ ఓటర్లు ఆకర్షితులవుతారని హాజ్రా భావిస్తున్నారు.