రహానే తప్ప ఎవరూ అడగట్లేదు...

రహానే తప్ప ఎవరూ అడగట్లేదు...

సుదీర్ఘ ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ పర్యటనలో భారత ఆటగాళ్ల ప్రదర్శనపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ మండిపడ్డాడు. ఆదివారం గావస్కర్‌ మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటి భారత ఆటగాళ్లలో అజింక్యా రహానే తప్ప మిగతా ఆటగాళ్లెవరు బ్యాటింగ్‌ విషయంలో తన సలహాలు అడగడం లేదు అని స్పష్టం చేశారు. ఒకప్పటి ఆటగాళ్లతో పోల్చుకుంటే ప్రస్తుత ఆటగాళ్ల తీరు పూర్తి భిన్నంగా ఉందన్నారు. ఒక్క రహానే తప్ప మిగతా వారు ఎవరి వద్ద సూచనలు, సలహాలు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నాడు. మేటిఆటగాళ్ళు సచిన్‌, ద్రవిడ్‌లు నా వద్ద బ్యాటింగ్‌ మెళకువలు నేర్చుకునేవారు అని గుర్తు చేశారు. లెజెండ్ కపిల్‌ దేవ్‌తో హార్దిక్‌ పాండ్యాను పోల్చడం సరికాదని గావస్కర్‌ అసహనం వ్యక్తం చేశాడు. కపిల్‌తో ఎవరినీ పోల్చలేమని.. బ్రాడ్‌మన్, సచిన్‌ల మాదిరి కపిల్‌ కూడా గొప్ప క్రికెటర్ అని తెలిపారు.

టెస్టుల్లో శిఖర్‌ ధావన్‌ ఆట తీరును మార్చుకునేందుకు ప్రయత్నించడం లేదన్నాడు. వన్డేల్లో షాట్లు ఆడి విజయవంతం అవుతున్నాడు. అదే తరహా ఆటతీరు టెస్టుల్లో పనికిరాదన్నారు. వన్డేల్లో మాదిరి స్లిప్‌లో పరుగులు చేయాలనుకుంటే క్యాచ్‌లు ఇవ్వడం తప్ప మరేమీలేదన్నారు. ఫార్మాట్‌కు తగినట్లుగా ఆడేందుకు మానసికంగా సిద్ధపడినప్పుడే విదేశీ గడ్డపై వైఫల్యాలను అధిగమించవచ్చు అని సూచించారు. టీంఇండియా మేనేజ్మెంట్ పుజారాను తుది జట్టులోంచి తప్పించి సిరీస్ మొదట్లోనే తప్పు చేసింది. లార్డ్స్ లో జరిగే టెస్ట్ మ్యాచ్ కు అదనపు బ్యాట్స్ మెన్ తో దిగాలని సూచించాడు. పుజారా లాంటి మంచి టెక్నిక్, సహనం ఉన్న ఆటగాడు టెస్టుల్లో అవసరం అని తెలిపారు.