ఎగ్జిట్ పోల్స్‌ ఎఫెక్ట్‌..? మాయావతి ఢిల్లీ పర్యటన రద్దు..!

ఎగ్జిట్ పోల్స్‌ ఎఫెక్ట్‌..? మాయావతి ఢిల్లీ పర్యటన రద్దు..!

ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత ఆ గణాంకాలను సమీక్షించే పనిలో పడ్డాయి వివిధ రాజకీయ పార్టీలు... ఇక ఎగ్జిట్ పోల్స్‌తో రాజకీయ సమీకరణలు కూడా మారతాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి. ముందుగా అనుకున్నట్టుగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో మాయావతి సమావేశం కావాల్సి ఉండగా.. ఆ భేటీని ఆమె రద్దు చేసుకున్నారు. అయితే, రాహుల్‌తో బీఎస్పీ నేత సతీష్ మిశ్రా సమావేశమయ్యే అవకాశం ఉందంటున్నారు. మాయావతి ఇవాళ ఢిల్లీకి రావడం లేదని... లక్నోలోనే ఉంటారని స్పష్టం చేశాయి బీఎస్పీ వర్గాలు. బీజేపీయేతర పక్షాల సమావేశంలో గానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీతో గానీ మాయావతి సమావేశం ఉండదని స్పష్టం చేస్తు్నాయి బీఎస్పీ వర్గాలు. కాగా, గత శనివారం లక్నో వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. మాయావతితో చర్చలు జరిపారు. అనంతరం ఆయన రాహుల్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఇవాళ సోనియాతో మాయావతి భేటీ అవుతారని బీఎస్పీ వర్గాల నుంచి సమాచారం వచ్చినా ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత తన పర్యటనను రద్దు చేసుకున్నారు మాయావతి.