రివ్యూ: ఎఫ్ 2

రివ్యూ:  ఎఫ్ 2

నటీనటులు : వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు, అన్నపూర్ణ, వై.విజయ, నాజర్‌ తదితరులు

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి

నిర్మాత: దిల్ రాజు 

దర్శకత్వం: అనిల్ రావిపూడి 

సంక్రాంతి అనగానే మనకు పల్లెటూరిలో పండుగ వాతావరణం కనిపిస్తుంది.  అందరు కలిసి సరదాగా సినిమాలకు వెళ్తుంటారు.  అందుకే సంక్రాంతిని టార్గెట్ చేసుకొని సినిమాలు వస్తుంటాయి.  ఈ సంక్రాంతిని మరింత కలర్ఫుల్ గా నవ్వులు పూయించేందుకు వెంకటేష్.. వరుణ్ తేజ్ లు ఎఫ్ 2అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  ఈరోజు రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. 

కథ: 

తమన్నా, మెహ్రీన్ లు హానీ సిస్టర్స్.   వెంకటేష్ ఒక ఎమ్మెల్యే దగ్గర పిఏ గా పనిచేస్తుంటాడు.  హాని సిస్టర్స్ లో ఒకరైన తమన్నాను వెంకటేష్ పెళ్లి చేసుకుంటాడు.  హ్యాపీగా సరదాగా సాగిపోయిన లైఫ్ పెళ్లి తరువాత అనూహ్యంగా టర్న్ అవుతుంది.  వెంకటేష్ ను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి భార్య తమన్నా, అత్తలు ప్రయత్నిస్తుంటారు.  అదే సమయంలో వరుణ్ తేజ్ హానీ సిస్టర్స్ లో చిన్నదైన మెహ్రీన్ ను ప్రేమిస్తాడు.  పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు.  ఇది తెలుసుకున్న వెంకటేష్.. తాను పడుతున్న ఇబ్బందులను వరుణ్ కు చెప్పి పెళ్లి చేసుకోవద్దని హెచ్చరిస్తాడు.  ఫుల్ గా ప్రేమలో మునిగిపోయిన వరుణ్.. వెంకటేష్ చెప్పే మాటలను పట్టించుకోకుండా మెహ్రీన్ ను పెళ్లి చేసుకుంటాడు.  మెహ్రీన్ కూడా అక్కలాగే వరుణ్ తేజ్ పై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తుంది.  దీంతో వెంకటేష్ లాగే వరుణ్ కూడా నలిగిపోతాడు.  పక్కింట్లో ఉండే రాజేంద్రప్రసాద్ సలహాతో ఇద్దరు యూరప్ వెళ్తారు.  వీరు వెళ్లినట్టుగానే వారి భార్యలు కూడా యూరప్ వస్తారు.  ఈ నలుగురు ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉంటారు.  యూరపే ఎందుకు వెళ్లారు..? ప్రకాష్ రాజ్ ఇంట్లో ఎందుకు ఉన్నారు..? ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

ముందునుంచి దర్శకుడు ఇది భార్యాబాధితుల సినిమా అని చెప్తున్నాడు.  చెప్పినట్టుగానే ఈ సినిమాలో దాన్ని చూపించాడు.  ఇంట్లో భార్యల నుంచి భర్తలకు వచ్చే ఇబ్బందులు.. ఆ ఇబ్బందుల్లో ఎలాంటి ఫ్రస్ట్రేషన్ కలుగుతుంది.  అన్నది మెయిన్ పాయింటైతే.. ఆ ఫ్రస్ట్రేషన్ కు కాస్త ఫన్ జోడించి.. తెరపై నవ్వులు పూయించారు.  సినిమా చూస్తున్నంత సేపు మల్లీశ్వరి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకు నచ్చావ్ వంటి వెంకటేష్ సినిమాలు గుర్తుకు వస్తాయి.  వినోదాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ హాఫ్ అంతా నడిపించాడు దర్శకుడు.  ప్రతి సీన్ లోను నవ్వులు పూయించే ప్రయత్నం చేసి సఫలం అయ్యాడు.  అత్తవారింట్లో అల్లుడు పడే కష్టాలను.. ఆ కష్టాల్లోనుంచి వచ్చే కామెడీని ప్రత్యేకంగా చూపించాడు.  ఈ సీన్స్ అన్ని సినిమాలో హైలైట్ అయ్యాయి.  ఒక్కో పాత్రకు ఒక్కో ఇంపార్టెన్స్ ఇచ్చాడు దర్శకుడు.  

సెకండ్ హాఫ్ ఎపిసోడ్స్ ఎక్కువగా యూరప్ బేస్డ్ లో నడుస్తాయి.  ఫస్ట్ హాఫ్ లో ఉన్న కామెడీ, కథలో బలం సెకండ్ హాఫ్ లో మనకు కనిపించదు.  అక్కడడక్కడా వచ్చే కొన్ని సీన్స్ మాత్రమే ఆకట్టుకున్నాయి.  సెకండ్ హాఫ్ స్టోరీలో ఇంకాస్త బలం ఉంటె బాగుండేది.  ప్రీ క్లైమాక్స్ లో నాజర్ ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయింది.  

నటీనటుల పనితీరు : 

వెంకటేష్ చాలాకాలం తరువాత పూర్తిస్థాయిలో వినోదాన్ని పండించాడు.  ఫ్రస్ట్రేషన్ లో వెంకటేష్ పాత్ర కడుపుబ్బా నవ్విస్తుంది.  వరుణ్ తేజ్ వెంకటేష్ కు మంచి సపోర్ట్ గా నిలిచాడు.  తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకున్నాడు. తమన్నా ఎప్పటిలాగే సినిమాలో హైలైట్ గా నిలిచింది.  మెహ్రీన్ అందంతో ఆకట్టుకుంది.  రాజేంద్రప్రసాద్, రఘుబాబు, ప్రకాష్ రాజ్, నాజర్ లు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

వినోదమే ప్రధానంగా తీసుకొని దర్శకుడు అనిల్ రావిపూడి రాసుకున్న కథనాలు బాగున్నాయి.  ఫస్ట్ హాఫ్ పై పెట్టిన దృష్టి సెకండ్ హాఫ్ లో కూడా పెట్టి ఉంటె సినిమా ఇంకాస్త బాగుండేది.  పెద్దగా ట్విస్ట్ లు లేకుండా సినిమాను నడిపించాడు.  దేవిశ్రీ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది.  పాటల చిత్రీకరణ బాగుంది.  యూరప్ అందాలను సమీర్ రెడ్డి అద్భుతంగా చూపించాడు.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  

పాజిటివ్ పాయింట్స్ :

వెంకటేష్ 

ఫస్ట్ హాఫ్ 

మైనస్ పాయింట్స్ : 

సెకండ్ హాఫ్ 

సన్నివేశాల సాగతీత 

కథ 

చివరిగా : సంక్రాంతి అల్లుళ్ళు బాగానే నవ్వించారు.