ఆర్నెల్లలో 300 కోట్ల నకిలీ అకౌంట్లు తొలగించిన ఫేస్ బుక్

ఆర్నెల్లలో 300 కోట్ల నకిలీ అకౌంట్లు తొలగించిన ఫేస్ బుక్

అక్టోబర్ 2018 నుంచి మార్చి 2019 మధ్య ఆర్నెల్ల కాలంలో సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ రికార్డు స్థాయిలో 300 కోట్లకు పైగా నకిలీ ఖాతాలను తొలగించింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ స్వయంగా ఒక నివేదకలో తెలిపింది. గత త్రైమాసికంలో తొలగించిన నకిలీ అకౌంట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. నెలవారీ యాక్టివ్ యూజర్లలో 5 శాతం వరకు నకిలీ అని ఫేస్ బుక్ తన ఎన్ ఫోర్స్ మెంట్ రిపోర్ట్ లో పేర్కొంది. ఆటోమేటెడ్ దాడులు పెరిగినందువల్ల ఇవి కూడా పెరుగుతున్నట్టు సంస్థ గుర్తించింది. ఫేస్ బుక్ 2018 నాలుగో త్రైమాసికంలో 120 కోట్ల నకిలీ ఖాతాలను, 2019 మొదటి త్రైమాసికంలో 219 కోట్ల ఫేక్ అకౌంట్లను డిజేబుల్ చేసింది.

ఫేస్ బుక్ ను సురక్షితమైన వేదికగా ఉంచేందుకు కంపెనీ నకిలీ ఖాతాలను తొలగిస్తోంది. ఈ ఖాతాలతో నకిలీ వార్తలను వ్యాప్తి చేయడమే కాకుండా.. ఈ ఖాతాల్లో అభ్యంతరకర కంటెంట్‌ ఉన్నందునే ఈ చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. విద్వేష ప్రసంగాలు, నగ్నత్వం, అభ్యంతరకర విషయాలను తొలగించి సంస్థ మార్గదర్శకాలను అమలు చేసేందుకు ఫేస్ బుక్ ప్రయత్నిస్తోంది. రికార్డు స్థాయిలో 70 లక్షల విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులను తొలగించినట్టు నిర్ధారించింది. ఖాతాల తొలగింపు అనంతరం ప్రస్తుతం ఫేస్‌బుక్‌ నెలవారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 204 కోట్లుగా ఉంది.