మోతెరా స్టేడియం గురించి ఈ వివరాలు తెలుసా...?

మోతెరా స్టేడియం గురించి ఈ వివరాలు తెలుసా...?

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం.. అంతర్జాతీయ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇచ్చేందుకు రెడీ అయింది. ఇండియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మూడో టెస్ట్.. మోతెరా స్టేడియంలో జరగనుంది. సామర్థ్యం పరంగా అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంగా మారిన ఈ మైదానం అభిమానులకు సరికొత్త అనుభుతిని ఇవ్వనుంది. 

భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న చివరి రెండు టెస్టులతో పాటు టీ20 సిరీస్‌కు మొతేరానే వేదిక..! ఈ స్టేడియం ఇప్పుడు ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం... ఇప్పుడు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న మూడో టెస్టుతో అంతర్జాతీయ మ్యాచ్‌కి తొలిసారి వేదిక కాబోతోంది. గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డున 1982లో దీనిని నిర్మించారు. అక్టోబరు 2015లో దీనిని పునరుద్ధరించాలని, సామర్థ్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ స్టేడియానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ షేర్‌ చేస్తోంది. పునరుద్ధరణకు ముందు ఈ స్టేడియం సామర్థ్యం 49 వేలు మాత్రమే. ఇప్పుడు దీని సామర్థ్యం రెండింతలకు పెరిగింది. చారిత్రక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ స్టేడియం సామర్థ్యం 90 వేలే కాగా, ఇప్పుడు దీనిని మొతేరా స్టేడియం అధిగమించింది. మొతేరా స్టేడియంలో లక్షా పది వేల మంది కూర్చొని హాయిగా మ్యాచ్‌ చూడొచ్చు..!  

మొతేరా మైదానాన్ని 63 ఎకరాల్లో నిర్మించారు. దీనికి నాలుగు ప్రవేశద్వారాలు ఉన్నాయి. అంతేకాదు.. నాలుగు డ్రెస్సింగ్‌ రూమ్‌లతో పాటు ఆరు ఇండోర్‌ ప్రాక్టీస్‌ పిచ్‌లు ఉన్నాయి., ఇక మూడు అవుట్‌డోర్‌ ప్రాక్టీస్‌ పిచ్‌లు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద స్టేడియంగా చెబుతున్నారు. 

పునరుద్ధరణ కోసం స్టేడియంను మూసివేయడానికి ముందు ఇక్కడ 12 టెస్టులు, 23 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ జరిగింది. 1984-85లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ స్టేడియం తొలిసారి అందుబాటులోకి వచ్చింది.  2006లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఇక్కడ మొత్తం 5 మ్యాచ్‌లు జరిగాయి. ప్రపంచకప్ మ్యాచ్‌ల కు కూడా మొతెరా ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు ఇంగ్లండ్‌, ఇండియా మూడో టెస్ట్‌తో తిరిగి అంతర్జాతీయ మ్యాచ్‌కి సిద్ధంగా ఉంది.