"పుష్ప"లో తన పాత్ర గురించి చెప్పేసిన విలన్..!

"పుష్ప"లో తన పాత్ర గురించి చెప్పేసిన విలన్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ "పుష్ప".  ఇందులో మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ రోల్ పోషిస్తున్నట్లు మార్చి మూడవ వారంలో మేకర్స్ ప్రకటించారు. ఈ అప్డేట్ రాగానే అటు కేరళలో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోయింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సాయంత్రం 'పుష్ప' టీజర్ విడుదల కానుంది. మరోవైపు ఫహద్ ఫాసిల్ నటించిన కొత్త చిత్రం ‘జోజి’ ఈరోజు ఉదయం ఓటిటి ప్లాట్‌ఫామ్ లో విడుదలైంది. ఈ క్రైమ్ డ్రామాకు విమర్శకులు, నెటిజన్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విలియం షేక్స్పియర్ 'మక్బెత్' ఆధారంగా నిర్మించిన ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ జోజిగా నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫహద్ 'పుష్ప'లో తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు. 'పుష్ప'లో తన పాత్ర చాలా ఫ్రెష్ అని, ఇంతకు ముందు ఇలాంటి పాత్రలో నటించలేదని, సుకుమార్ వివరించిన స్క్రిప్ట్ తనకు బాగా నచ్చిందని అన్నారు. అంతేకాదు సుకుమార్ తెరకెక్కించిన 'రంగస్థలం' చిత్రం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ 'విక్రమ్'‌లో కూడా నటిస్తున్నట్టు స్పష్టం చేశారు ఫహద్.  

'పుష్ప' చిత్రం ఎర్ర గంధపు అక్రమ రవాణాతో ముడిపడి ఉన్న వారి జీవితాల చుట్టూ తిరుగుతుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు ధనంజయ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, హరీష్ ఉతామన్, వెన్నెలా కిషోర్, అనీష్ కురువిల్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆస్కార్ అవార్డును అందుకున్న సౌండ్ డిజైనర్ రేసుల్ పూకుట్టిని రంగంలోకి దింపుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. 'పుష్ప'ను పాన్ ఇండియా మూవీ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం. కన్నడ భాషల్లో భారీ రేంజ్ లో విడుదల చేయనున్నారు.