నకిలీ బాబా అరెస్ట్ 

నకిలీ బాబా అరెస్ట్ 

కుటుంబ సమస్యలతో బాధ పడే వారిని ఆసరాగా తీసుకొని లక్షలు గడించారు ఓ నకిలీ బాబా. మీకున్న ఎటువంటి సమస్యలనైనా తీరుస్తామంటూ టీవీల్లో రకరకాలుగా ప్రకటనలిచ్చాడు. అది చూసి నమ్మి వచ్చిన భక్తులను మాటల గారడీతో మాయ చేశాడు. ప్రత్యేక పూజలు, హోమాలు అంటూ విలువైన వస్తువులను డబ్బును గుంజడం మొదలెట్టాడు. హైదరాబాద్‌ రామంతాపూర్‌ టీవీ కాలనీకి చెందిన వైవీ శాస్త్రి (60) అనే దొంగ బాబా ఘోరమైన లీలలకు పాల్పడ్డాడు. తన మాయ మాటలతో భక్తులను నమ్మించి ఆరునెలల్లోనే రూ.2కోట్ల వరకు పోగేసుకున్నాడు. ఈ విధంగా చేస్తుండటంతో మోసపోయిన కొందరు భక్తుల చేసిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దొంగబాబాను అరెస్టు చేశారు. బోయిన్‌పల్లి సీఐ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ... రామంతాపూర్‌ టీవీ కాలనీకి చెందిన వైవీ శాస్త్రి అలియాస్‌ ఏలేశ్వరప్ప అలియాస్‌ వెంకటేశ్వర శాస్త్రి బాబా అవతారమెత్తి ప్రజలను మోసం చేశాడని తెలిపారు. మొదట తాను తమ సమస్యలు తీర్చుతానంటూ పలు చానళ్లలో ప్రకటనలు ఇచ్చారని ఆ తర్వాత.. తానే స్వయంగా భక్తుల ఇళ్లకెళ్లి పూజల పేరుతో డబ్బు తీసుకునే వాడని వివరించారు. అయితే అలా పూజలు చేసినా కష్టాలు తీరలేదని బోయిన్‌పల్లి కి చెందిన ఓ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కొన్నాళ్లుగా పరారీలో ఉన్న శాస్త్రిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం అని వివరించారు. గతంలో కూడా శాస్త్రి ఇదే విధమైన మోసాలకు పాల్పడితే 2017లో ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.