ప్రియురాలి కోసం పోలీసు వేషం.. యువకుడి అరెస్ట్‌

ప్రియురాలి కోసం పోలీసు వేషం.. యువకుడి అరెస్ట్‌

ప్రియురాలి కోసం పోలీసు అధికారి అవతారమెత్తి కటకటాల పాలయ్యాడో యువకుడు. సికింద్రాబాద్‌ పరిధిలోని జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గోదావరిఖనికి చెందిన రవిచంద్ర ఇంజనీరింగ్‌ మధ్యలోనే ఆపివేశాడు. అతను ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని ఆ యువతి కుటుంబసభ్యులను కోరగా.. ఉద్యోగం లేనందున వారు ససేమిరా అన్నారు. ఈక్రమంలో నగరంలో డేటా ఎంట్రీ జాబ్‌ సంపాదించినప్పటికీ.. రవిచంద్రకు వేరే ఆలోచన తట్టింది. పోలీసు అధికారిగా నమ్మిస్తే.. యువతిని పెళ్లిచేసుకోవచ్చని.. అక్రమ మార్గంలో డబ్బు కూడా సంపాదించవచ్చని భావించాడు. 

అనుకున్నదే తడువుగా ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ అవతారమెత్తాడు. 2012 బ్యాచ్‌ డీఎస్పీగా అందరినీ నమ్మించాడు. తనకు తెలిసిన ఓ పోలీసు అధికారి వద్ద ఐడీ కార్డు తీసుకుని దాని ద్వారా ఫోటో మార్ఫింగ్‌ చేసి ఓ ఐడీ కార్డు సృష్టించాడు రవిచంద్ర. పోలీస్‌ యూనిఫామ్‌తోపాటు నేమ్‌ ప్లేట్‌ పెట్టుకుని తమ వీధిలో వాళ్లను కూడా నమ్మించాడు. ఇంతలో ఈ విషయం ఈనోటా ఆనోటా చేరడంతో పోలీసులకు సమాచారం అందింది. రవిచంద్ర నకిలీ పోలీసని నిర్ధారించుని.. అరెస్టు చేశారు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రవిచంద్ర మోసాలపై ఆరా తీస్తున్నారు.