మందుబాబులు జాగ్రత్త.. పైన పటారం లోన లొటారం

మందుబాబులు జాగ్రత్త.. పైన పటారం లోన లొటారం

పైన పటారం లోన లొటారం. పైకేమో బ్రాండ్ లేబుల్స్, స్పెషల్ ప్యాకింగ్ లు... ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో అసలు పోల్చలేం. స్పిరిట్ రసాయనాల సహాయంతో ఆ ముఠా కల్తీ మద్యం తయారు చేసేసారు. అది తాగితే ప్రాణాలు గాల్లోకి పోవాల్సిందే... ఆ కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ బాటిల్ లో నింపి నకిలీ స్టిక్కర్లు అతికించేశారు. సరిహద్దులు దాటించేసి విశాఖ నగరంలో అమ్మేస్తున్నారు... పక్కా సమాచారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కల్తీ మద్యం ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఒరిస్సా రాష్ట్రంలోని బరంపురం కేంద్రంగా కల్తీ మద్యం వ్యాపారం జోరుగా కొనసాగుతూ ఉంది. అక్కడ నుండి వివిధ నగరాలకు గుట్టు చప్పుడు కాకుండా అమ్మేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పక్కా సమాచారం అందుకున్న = శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.  ఈ క్రమంలో విశాఖలోని గాజువాక ప్రాంతానికి అక్రమంగా మద్యం తరలిస్తున్నారని తెలుసుకున్న ఎస్ఈబి అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 25న గాజువాకలో ఓ పెట్రోల్ బంకు సమీపంలో తనిఖీలు చేపట్టారు. అనుమానంతో ఒక కారులో తనిఖీలు చేయగా రాయల్ స్టాగ్ బ్రాండ్ డ్ విస్కీ స్టిక్కర్ లతో ఉన్న 250 బాటిల్ లు లభించాయి. ఒరిస్సా రాష్ట్రం బరంపురం ప్రాంతానికి చెందిన నాగిరెడ్డి, కంకిపాడు శ్రీనివాస్ వీరిద్దరూ కల్తీ మద్యం తయారు చేసి నగరంలో విక్రయిస్తున్నారు.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వారి వద్ద నుంచి సమాచారం అందుకున్న ఎస్ సి బి అధికారులు మూడు బృందాలుగా విడిపోయారు. విశాఖ సిటీ, రూరల్, శ్రీకాకుళం జిల్లా అధికారులు ఒడిస్సా లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. బరంపురం లో కల్తీ మద్యం తయారు చేస్తున్న ప్రదేశానికి వెళ్లి ఏ 3 నిందితుడు సాగర్ కుమార్ సాహో ని అరెస్ట్ చేశారు. రెండు సెల్ ఫోన్లు 250 విస్కీ బాటిల్స్ , 20 లీటర్ల లిక్కర్ లిక్విడ్, అతి ప్రమాదకరమైన ఐదు లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్,  150 ఖాళీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ మద్యం తయారీకి ఉపయోగించే ముడి సరుకు ఎక్కడ లభ్యమవుతుంది... వీరి వెనుక ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందా...? అన్న కోణంలో విచారణ చేపడుతున్నామని అంటున్నారు.