కరోనా మీద ఫేక్ ప్రచారం...ఎన్టీవీ పేరిట నకిలీలు !

కరోనా మీద ఫేక్ ప్రచారం...ఎన్టీవీ పేరిట నకిలీలు !


భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరింది. ఇప్పటివరకూ సుమారు 6 లక్షల మందికి పైగా స్క్రీనింగ్‌ చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు నెలాఖరు వరకూ సెలవులు ప్రకటించింది. మరికొన్ని సంస్థలు తగిన భద్రతా చర్యలు చేపట్టాయి. తెలంగాణలో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు మాత్రమే నమోదైంది. తాజాగా ఇద్దరు అనుమానితులకు నెగెటివ్ రిపోర్ట్‌లు రావడంతో ప్రభుత్వం, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే జలుబు, దగ్గుతో బాధపడుతున్న పలువురు ఆసుపత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అనుమానిత లక్షణాలెవరికైనా ఉంటే వెంటనే ఆసుపత్రికి రావాలని కోరుతోంది. ఏపీలో ఇప్పటిదాకా ఒక్క పాజిటివ్ కేసు కూడా పాజిటివ్ అని తేలలేదు. అయతే నిన్న కరోనా వైరస్‌పై ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. వివిధ దేశాల నుంచి వచ్చిన 330 మంది ప్రయాణికులను పరిశీలనలో ఉంచామని.. వారిలో 102 మందికి వారి ఇళ్లలోనే వైద్య పరిశీలనలో ఉంచామని పేర్కొంది. మిగిలిన 216 మందిలో ఇప్పటి వరకూ 23 మంది శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించగా.. 11 శాంపిల్స్ నెగిటివ్‌ గా నిర్ధారణ అయ్యాయని తెలిపింది. అయితే 12 శాంపిల్స్ ఫలితం ఇంకా రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ఎన్టీవీ పేరిట ఫేక్ టెంప్లేట్లు వైరల్ :

అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మా సంస్థ పేరును దెబ్బ తీసేలా కొన్ని ఫేక్ స్క్రీన్ షాట్ లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. నిన్నటి నుండి రెండు స్క్రీన్ షాట్ లు మా దృష్టికి వచ్చాయి. ఒకటి కృష్ణా జిల్లా పెడనలో కరోనా అంటూ ప్రచారం జరగగా మరొకటి ఏమో నల్గొండ జిల్లా చందంపేట అంటూ సోషల్ మీడియాలో తిరుగుతోంది. అయితే ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా పోలీసుల దృష్టికి వెళ్తే ఇబ్బంది తప్పదు. ఒక భయానక వైరస్ మన ఊరు  వచ్చేసిందని చెప్పడంలో ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నారో ? అందుతున్న సమాచారం మేరకు కొన్ని కాలేజ్ ల విధ్యార్ధులు కాలేజ్ లు సెలవలు ఇస్తాయని ఇలాంటి ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్ట్టు చెబుతున్నారు. ఈ ప్రచారం పోలీస్ వారి దృష్టికి వస్తే వారికి ఇబ్బంది అనే విషయాన్ని మర్చుపోతున్నారు.