సర్కార్‌కు తలనొప్పిగా సోషల్ మీడియా..?

సర్కార్‌కు తలనొప్పిగా సోషల్ మీడియా..?

సోషల్‌ మీడియా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఇది అతిపెద్ద తలనొప్పి వ్యవహరంగా తయారైంది. ప్రభుత్వం మీద.. ప్రభుత్వ పెద్దల మీద.. ప్రభుత్వ పథకాల మీద.. ఇలా వరుసపెట్టి తప్పుడు ప్రచారం జరుగుతుండటం ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ఎక్కడికెక్కడి నుంచో పోస్టులు పెడుతూ సోషల్‌ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నిరకాల చర్యలు తీసుకున్నా.. దుష్ప్రచారం ఆగడం లేదని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. తాజాగా తెర మీదకు వచ్చిన మరో అంశం ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో ప్రభుత్వానికి.. అధికారులకు సోషల్‌ మీడియా వేదికగా జరిగే రకరకాల ప్రచారానికి సమాధానాలు చెప్పుకోవడానికే సగం సమయం సరిపోతుందనే చర్చ జరుగుతోంది.

ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ వయస్సును 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకే కుదిస్తున్నారంటూ ఓ ప్రచారం ప్రారంభమైంది. దీంతో ఒక్కసారిగా ఉద్యోగవర్గాల్లో కలవరం బయలుదేరింది. ఇటీవలకాలంలో జగన్‌ సర్కార్‌ పెద్దఎత్తున సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ క్రమంలో ఈ నిర్ణయం కూడా తీసేసుకున్నారేమోననే ఆందోళన ఉద్యోగుల్లో కన్పించింది. అయితే, ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని.. అది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని.. సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా సచివాలయ ఉద్యోగుల సంఘం సీఐడికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఈ తరహా ప్రచారానికి అడ్డుకట్ట పడింది. అయితే, తాజాగా అదే మెసేజ్‌ మళ్లీ సోషల్‌ మీడియాలో తిరుగుతోంది. దీంతో మళ్లీ ఉద్యోగ వర్గాల్లో అదే తరహా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో వారికి నచ్చెచెప్పడం ఉద్యోగ సంఘ నేతలకు తలకు మించిన భారంగా మారుతోంది. సున్నితమైన అంశాలపై సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే కుట్ర జరుగుతోంది. దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలో తెలియక ప్రభుత్వం సతమతమవుతోంది.