చెడబుట్టాడు.. చంపేయండి..

చెడబుట్టాడు.. చంపేయండి..

తమ కొడుకును ఉరితీసినా తప్పులేదన్నారు హాజీపూర్ సైకో శ్రీనివాస్‌రెడ్డి తల్లిదండ్రులు... హాజీపూర్‌లో ముగ్గురు చిన్నారులపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు బయటకు రాగానే అతని కుటుంబసభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలిసారిగా ఎన్టీవీతో మాట్లాడిన శ్రీనివాస్‌రెడ్డి తల్లిదండ్రులు.. అలాంటి వాడికి ఏ శిక్ష వేసినా తప్పులేదన్నారు. శ్రీనివాస్‌రెడ్డిని ఉరి తీయాలని అతడి తండ్రి బాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తమతో సాధారణంగా ఉండే తన చిన్నకొడుకు ఇన్ని నేరాలకు పాల్పడతాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కర్నూలులో ఉన్నపుడు ఓ కేసు నుంచి తన పెద్దకొడుకు సుధాకర్‌రెడ్డి, తాను వెళ్లి విడిపించామన్నారు. శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రావణి హత్య జరిగిన రోజు గ్రామంలోని వారు బావి వద్ద వెదుకుతుంటే తామిద్దరం అక్కడే ఉన్నామని.. అప్పుడు అతని మొహంలో ఎలాంటి భయాందోళనలూ కనపడలేదన్నారు. పోలీసులు తనను, తన తండ్రిని కస్టడీలో ఉంచిన సమయంలో పోచంపల్లి సమీపంలోని రావిరాలలో తమ బంధువుల ఇంట్లో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని తానే పట్టించానని వెల్లడించారు. ఉరిశిక్ష కంటే పెద్ద శిక్షను తన తమ్ముడికి విధించాలని పేర్కొన్నారు సుధాకర్‌రెడ్డి. ఇక తన చిన్నకొడుకును శ్రీనివాస్‌రెడ్డిని చంపేయండి.. తనకు ఒక్కడే కొడుకు అనుకుంటానన్నారు తల్లి... కానీ, మమ్మల్ని బాధపెడితే వాళ్లకు ఏం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.