తోపులాటలో దుల్కర్ అభిమాని మృతి

తోపులాటలో దుల్కర్ అభిమాని మృతి

అభిమానానికి ఒక హద్దు ఉండాలి.  అభిమాన తారలపై తమ అభిమానాన్ని చూపించవచ్చు.  ఆ అభిమానం ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ఉండకూడదు.  గతంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమా ఆడియో  వేడుకల సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావడం.. తోపులాటలు, లాఠీఛార్జ్ లు జరగడం.. అభిమానులు గాయాల పాలవ్వడం.. ప్రాణాలు పోవడం వంటిని చూశాం.  ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హీరోలు పలుమార్లు బహిరంగంగా చెప్పినా, అభిమానులు చెవికెక్కించుకోలేదు. ఇది పాత విషయం.  

కొత్త విషయం ఏమిటంటే.. సౌత్ లో స్పీడ్ గా దూసుకుపోతున్న హీరో దుల్కర్ సల్మాన్, మలయాళంతో పాటు తమిళ, తెలుగు భాషల్లో కూడా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు.  ఈ హీరో కేరళలోని కొల్లామ్ లో ఓ మాల్ ఓపెనింగ్ కోసం వచ్చారు.  తన అభిమాన హీరో వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున మాల్ వద్దకు చేరుకున్నారు.  భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడటంతో తోపులాట జరిగింది.  ఈ తోపులాటలో హరి అనే అభిమానికి గుండెపోటు వచ్చింది.  హుటాహుటిన హరిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లినా లాభం లేకపోయింది.  అప్పటికే హరి మరణించాడు.  గతంలో హరికి ఒకసారి గుండెపోటు వచ్చిందట.  అభిమానులు అధిక సంఖ్యలో హాజరైతే వారిని అదుపు చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పోలీసులు మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.