కసాయిలా మారిన కన్నతండ్రి  

కసాయిలా మారిన కన్నతండ్రి  

కన్న తండ్రి అక్రమ సంబంధం పెట్టుకొని పసిపిల్లవాడిపై కసాయిగా మారిన ఘటన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట లెనిన్ నగర్ లో చోటు చేసుకుంది. మానవత్వాన్ని మరచిన శివ అనే కన్న తండ్రి 9నెలల పసి ప్రాణిని చిత్రహింసలకు గురిచేశాడు. జగద్గిరి గుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో రాత్రి 2గంటల ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. 

మేడిపల్లికి చెందిన శివ, అనుషా 10 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకుని జగద్గిరిగుట్ట లెనిన్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత కేపీహెచ్ బిలో రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకొనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొన్న శివ, భార్య అనుషా దగ్గరకు రాకుండా కొంత కాలంగా అక్కడే ఉంటున్నాడు. అప్పుడప్పుడు అనుషా వద్దకు వచ్చిపోతుండేవాడు. అదే క్రమంలో గతరాత్రి రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చి అనుషాతో వాగ్వాదానికి దిగాడు. మాటా మాటా పెరిగి ఉన్మాదిలా ప్రవర్తిస్తూ.. భార్య అనుషాపై దాడి చేసి తన కొడుకును పోలీసుల ముందే చిత్రహింసలకు గురిచేస్తూ... రాక్షసుడులా ప్రవర్తించాడు. వెంటనే విషయం తెలుసుకున్న జగద్గిరిగుట్ట సీఐ నర్సింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన బాలుడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఆ తర్వాత భర్త శివపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.