సాధ్వీ ప్రజ్ఞను ఎన్నికల్లో పోటీ చేయనీయవద్దు

సాధ్వీ ప్రజ్ఞను ఎన్నికల్లో పోటీ చేయనీయవద్దు

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న మాలెగావ్ పేలుళ్ల నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మాలెగావ్ పేలుళ్లలో ఒక బాధితుడి తండ్రి అయిన నజీర్ బిలాల్ ఆమెను పోటీకి అనుమతించరాదని ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట దరఖాస్తు దాఖలు చేశారు. ఆయన సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ అభ్యర్థిత్వాన్ని ఎన్ఐఏ కోర్టులో ప్రశ్నించారు. ఆమె తన బెయిల్ దరఖాస్తులో పేర్కొన్న ఒక కారణంగా చూపిన ఆరోగ్య పరిస్థితిని ఆయన సవాల్ చేశారు. ఆమె ప్రతి విచారణ రోజున వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యేలా ఆదేశించాలని నజీర్ బిలాల్ కోరారు.

మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలైన సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ సింగ్ బుధవారం అధికారికంగా బీజేపీలో చేరారు. మాలేగావ్ బ్లాస్ట్ కేసు కారణంగా వార్తల్లో నిలిచిన హిందూ కార్యకర్తగా సాధ్వీ ప్రజ్ఞా సింగ్ చర్చల్లో నిలిచింది. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్ లోని ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. కుటుంబ నేపథ్యాన్ని అనుసరించి ఆమె ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీలలో ఎంతో కాలం పని చేశారు. తర్వాత సన్యాసం స్వీకరించారు. సాధ్వీ 2008లో జరిగిన మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలు.