కుమారుడు ఎగ్జామ్‌కు.. తండ్రి అనంతలోకాలకు

కుమారుడు ఎగ్జామ్‌కు.. తండ్రి అనంతలోకాలకు

కొడుకు నీట్‌ పరీక్షకు వెళ్లిన కొద్దిసమయానికే గుండె పోటుతో ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్ళాడు. ఈ విషాద సంఘటన కేరళలో చోటుచేసుకుంది. తమిళనాడు తిరువూరు జిల్లాకు చెందిన కృష్ణస్వామి తన కుమారుడు కస్తూరి మహాలింగం ఆదివారం నీట్‌ ఎగ్జామ్‌ ఉండటంతో ఎర్నాకుళంలోని ఓ హోటల్ లో బసచేశారు. ఈరోజు ఉదయం హోటల్‌ నుంచి కృష్ణస్వామి.. కుమారుడు కస్తూరి మహాలింగం నీట్‌ పరీక్ష కోసం ఆటోలో పరీక్షా కేంద్రానికి పంపారు. తనకు అస్వస్థతగా ఉందని హోటల్‌ సిబ్బందికి చెప్పడంతో.. వారు దగ్గరలోని సిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉదయం సుమారు 8.20 గంటలకు ఆస్పత్రికి చేరుకున్న కృష్ణస్వామి షుగర్‌ లెవెల్స్‌ బాగా పెరిగిపోయాయని డాక్టర్లు తెలిపారు. తర్వాత హఠాత్తుగా కుప్పకూలిన ఆయన తీవ్ర గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబానికి తమిళనాడు సీఎం పళనిస్వామి రూ 3 లక్షల పరిహారం ప్రకటించారు. మృతదేహాన్ని కృష్ణస్వామి స్వస్థలంకి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.