తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఓటింగ్? పరిశీలిస్తున్న ఈసీ

తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఓటింగ్? పరిశీలిస్తున్న ఈసీ

ఈ వేసవిలో జరగనున్న లోక్ సభ సాధారణ ఎన్నికలను తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఒకే దశలో నిర్వహించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి వినతి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున పోలింగ్ నిర్వహిస్తే డబుల్ ఓటింగ్ జరిగే అవకాశాన్ని నిరోధించవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూచించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఇతర ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ కి చెందినవారు పెద్దసంఖ్యలో నివసిస్తున్నారని వీరు రెండుసార్లు ఓట్లేయకుండా అడ్డుకోవచ్చని చెప్పింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహించడాన్ని పరిశీలించాల్సిందిగా కోరుతూ ఈసీకి లేఖ రాసినట్టు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ బుధవారం తెలిపారు. ‘ఒకేరోజు రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ నిర్వహించడం వల్ల చాలా ఖర్చుని నివారించవచ్చని, రెండు రాష్ట్రాల్లో ఓట్లు డూప్లికేట్ అవుతాయనే పార్టీల ఆందోళనను తగ్గించవచ్చని’ రజత్ కుమార్ అన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గత సాధారణ ఎన్నికలు రెండు దశల్లో (ఏప్రిల్ 30న తెలంగాణ, మే 7న ఆంధ్రప్రదేశ్) జరిగాయి. రాష్ట్రంలో అధికార టీడీపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెబుతూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 4న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో మొత్తం 3.69 కోట్ల మంది ఓటర్లు ఉండగా టీడీపీ 59.18 లక్షల డూప్లికేట్ ఓటర్లను చేర్చిందని తమ విశ్లేషణలో స్పష్టమైందని ఆయన తెలిపారు. ఈ 59.18 లక్షల బోగస్ ఓట్లలో 20,07,395 మంది ఓటర్లు పేర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చోట్లా ఉన్నాయని చెప్పారు.

ఉదాహరణకు శశి కుమారి, వైఫ్ ఆఫ్ కృష్ణమూర్తి పేరు చిత్తూరు జిల్లాలోని తిరుపతి నియోజకవర్గం బూత్ నెం.40లో సీరియల్ నెం.100గా నమోదైంది. ఆమెకు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బూత్ నెం.256లో కూడా సీరియల్ నెం.129 కింద ఓటుంది. ఆశ్చర్యకరంగా రెండు చోట్ల ఆ ఓటర్ కి అదే ఓటర్ ఐడీ కార్డ్ నెం.MZT5438635 ఉందని జగన్ వివరించారు.

ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘వాళ్లు హైదరాబాద్ లో నివసిస్తున్నప్పటికీ వాళ్లకి ఆంధ్రాలో ఆస్తులు, కుటుంబాలు ఉన్నాయి. శెలవులకు వాళ్లు తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. విభజన తర్వాత 5,000 పైగా ఉద్యోగులు అమరావతి, విజయవాడకి తరలివెళ్లారు. కానీ వాళ్ల కుటుంబాలు, ఇళ్లు హైదరాబాద్ లో ఉన్నాయి. ప్రతి వారాంతంలో వాళ్లు నగరానికి వస్తుంటారు. వాళ్లు తమ పేర్లు రెండు రాష్ట్రాల్లో నమోదు చేసుకొని ఉండొచ్చని’ తెలిపారు.

అయితే టీడీపీ ఈ వాదనలను కొట్టిపారేసింది. ‘రెండు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తే మాకే అభ్యంతరం లేదు. కానీ టీడీపీ అనుకూల ఓటర్లు రెండు రాష్ట్రాల్లో డబుల్ ఓటింగ్ కి పాల్పడవచ్చన్న ఆరోపణలు అర్థరహితం. అలాంటి డబుల్ ఓటర్ల సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది. డబుల్ ఓటింగ్ ని నిరోధించేందుకు ఈసీ యంత్రాంగం ఉందని’ టీడీపీ అధికార ప్రతినిధి వై. బాబూ రాజేంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు.