20 నెలల కనిష్ఠానికి వృద్ధి రేటు, 2.57% పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం

20 నెలల కనిష్ఠానికి వృద్ధి రేటు, 2.57% పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం

మానుఫాక్చరింగ్ రంగం మందకొడిగా కొనసాగుతుండటంతో ఫిబ్రవరిలో ఇండస్ట్రియల్ ఔట్ పుట్ (ఐఐపీ)వృద్ధి 0.1 శాతం మాత్రమే నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి అంటే ఫిబ్రవరిలో ఇది 6.9 శాతంగా ఉంది. ఆహార పదార్థాలు, ఇంధనాల ధరలు పెరగడంతో మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగి 2.86 శాతం స్థాయికి చేరింది. గత నెలలో అంటే ఫిబ్రవరిలో ఇది 2.57 శాతంగా ఉంది. ప్రభుత్వం జారీ చేసిన గణాంకాలతో ఈ వివరాలు వెలుగు చూశాయి.

ఫిబ్రవరిలో ఐఐపీలో ఇంత తక్కువ వృద్ధి రేటు 20 నెలల్లో ఇదే కనిష్ఠమని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు జూన్ 2017లో ఇంత కంటే తక్కువ వృద్ధి రేటు నమోదైంది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా ఐఐపీకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా ఉందో తెలుస్తుంది. ఐఐపీ అంచనాల కోసం 15 ఏజెన్సీల నుంచి వివరాలను సేకరిస్తారు. వీటిలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కూడా ఉంటాయి.

ఏప్రిల్-ఫిబ్రవరి, 2018-19 మధ్య ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) వృద్ధి 4 శాతంగా ఉంది. ఏడాది ముందు అంటే ఏప్రిల్-ఫిబ్రవరి 2017-18లో ఇది 4.3 శాతం.

సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (సీఎస్ఓ) జారీ చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 2019లో ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 0.3 శాతం పెరుగుదల నమోదైంది. గత నెలలో ఇందులో 0.66 శాతం తగ్గుదల వచ్చింది.

ఫ్యూయల్ అండ్ లైట్ కేటగిరీలో కూడా ద్రవ్యోల్బణం వచ్చింది. మార్చిలో ఈ సెగ్మెంట్ లో 2.42 శాతం పెరుగుదల నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 1.24 శాతంగా ఉంది.