రోహిత్‌కు రాని అవకాశం నాకొచ్చింది!-కోహ్లీ

రోహిత్‌కు రాని అవకాశం నాకొచ్చింది!-కోహ్లీ

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విక్టరీకి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కీలకంగా మారింది.. కోహ్లీ 120 పరుగులతో చెలరేగిపోతే.. శ్రేయస్ అయ్యర్ 71 పరుగులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించడంతో టీమిండియా 279 పరుగులు చేయగలిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారతజట్టు ఓపెనర్లు ఇద్దరూ విఫలమయ్యారు. శిఖర్‌ధావన్ 2 పరుగులకే పెవిలియన్ చేరితే.. రోహిత్‌శర్మ 18 పరుగులతో సరిపెట్టుకున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోర్‌కే విఫలం కావడంతో ఇన్సింగ్స్‌ని చక్కదిద్దే బాధ్యత తనపై పడిందన్నారు. జట్టు 270కిపైగా పరుగులు చేస్తే మ్యాచ్‌పై పట్టుసాధించొచ్చని మాకు తెలుసు. అయితే, ఓపెనర్లు ఔట్ కావడంతో క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి అడుగుపెట్టి సెంచరీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ధావన్‌, రోహిత్‌ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు... దాంతో ఆ అవకాశం నాకు వచ్చిందన్నారు టీమిండియా కెప్టెన్. 

తొలి మ్యాచ్‌ను అడ్డుకున్నట్టుగానే రెండో మ్యాచ్‌కి కూడా కొద్దిసేపు వర్షం అడ్డంకి సృష్టించింది.. దీంతో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేయడమే మంచిదైందన్నారు కోహ్లీ... రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా పిచ్‌ నెమ్మదించిందని.. ఆ తర్వాత ఇక వారు బ్యాటింగ్‌ చేయడం కష్టంగా మారిందన్నాడు భారత కెప్టెన్. మరోవైపు మిడిల్‌ఆర్డర్‌లో వచ్చి 71 పరుగులు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌పై ప్రశంసలు కురిపించారు విరాట్.. ఇక, శ్రేయస్ అయ్యర్‌లో మంచి ఆత్మవిశ్వాసం కనిపించిందని.. నాకు తోడుగా అయ్యర్‌ ఉండడంతో తనపై ఒత్తిడి తొలగిపోయిందని చెప్పాడు. కాగా, వర్షం కారణంగా డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో 46 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.