అర్జెంటీనా విజయం.. నౌకౌట్‌ ఆశలు సజీవం

అర్జెంటీనా విజయం.. నౌకౌట్‌ ఆశలు సజీవం

ఫిఫా ప్రపంచ కప్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో అర్జెంటీనా విజయం సాధించింది. గ్రూప్ 'డి'లో భాగంగా అర్జెంటీనా, నైజీరియా మధ్య జరిగిన పోరులో 2-1 తేడాతో అర్జెంటీనా విజయం సాధించి నాకౌట్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఆట 14వ నిమిషంలో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్‌ మెస్సీ అద్బుత గోల్‌ సాధించాడు. తర్వాత ఇరు జట్లు గోల్ చేయడానికి పోటీపడ్డా మరో గోల్ చేయలేకపోయాయి. దీంతో అర్జెంటీనా తొలి అర్థబాగంను 1-0తో ముగించింది. రెండో అర్ధబాగం 49వ నిమిషంలో అర్జెంటినా ఆటగాడు జేవియర్ మస్చెరానో ఫౌల్‌ చేయడంతో నైజీరియా జట్టుకు పెనాల్టీ లభించింది. నైజిరియా ఆటగాడు విక్టర్ మోసెస్ 51 నిమిషంలో బంతిని  గోల్‌పోస్ట్‌లోకి పంపి స్కోరును 1-1తో సమం చేసాడు. ఆ తర్వాత హోరాహోరిగా సాగిన గేమ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు.

86వ నిమిషంలో సహచర ఆటగాడి నుంచి లభించిన పాస్‌ను అర్జెంటీనా ఆటగాడు మార్కోస్‌ రోజో బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపి అర్జెంటీనాకు 2-1తో ఆధిక్యంను అందించాడు. మ్యాచ్ సమయం  ముగియడంతో అర్జెంటీనా 2-1తో నైజీరియాపై గెలుపొందింది. ఇక అర్జెంటీనా నాకౌట్‌ చేరే అవకాశం క్రొయేషియా-ఐస్‌లాండ్‌ మ్యాచ్‌ ఫలితంపైనా ఆధారపడి ఉంది. ఐస్‌లాండ్‌పై క్రొయేషియా గెలిచినా.. మ్యాచ్‌ డ్రా అయినా అర్జెంటీనాకు నాకౌట్‌ చేరే అవకాశం ఉంది.

Photo: FileShot