లుకాకు మ్యాజిక్.. బెల్జియం విజయం

లుకాకు మ్యాజిక్.. బెల్జియం విజయం

ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న బెల్జియం జట్టు అంచనాలకు మించి ఆడుతూ వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం గ్రూప్‌ ‘జి’లో భాగంగా స్పార్టక్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో బెల్జియం జట్టు 5-2తో ట్యునీషియాపై ఘన విజయం సాధించింది. ఆట ప్రథమార్ధం ఆరో నిమిషంలోనే వీఏఆర్‌ ద్వారా లభించిన పెనాల్టీ కిక్‌ను హజార్డ్‌ గోల్‌గా మలిచాడు. అనంతరం 16వ నిమిషంలో ఇన్‌సైడ్‌ బాక్స్‌లో మెర్టెన్స్‌ నుంచి పాస్‌ అందుకున్న లుకాకు ఎడమ కాలితో బంతిని గోల్ పోస్ట్ లోకి పంపి స్కోరును 2-0కి పెంచాడు. ఈ దశలో పుంజుకున్న ట్యునీషియా.. కెప్టెన్‌ ఖజ్రి ఫ్రీకిక్‌ను అందుకున్న బ్రోన్‌ హెడర్‌తో ఖాతా తెరిచాడు. ఈ దశలో ఇరుజట్ల ఆటగాళ్లు గోల్ చేయడానికి పోటీపడ్డారు. మొదటి భాగం ఇంజ్యూరీ సమయంలో మ్యూనియర్‌ నుంచి వచ్చిన పాస్‌ను ఇన్‌సైడ్‌ బాక్స్‌ బయట కీపర్‌ను తప్పిస్తూ లుకాకు రెండో గోల్‌ కొట్టడంతో 3-1తో ఆధిక్యంలోకి వెళ్ళింది.

ఇక రెండవ భాగం ప్రారంభంలో ట్యునీషియాకు వరుసగా రెండు గోల్స్‌ అవకాశాలు వచ్చాయి కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. 51వ నిమిషంలో అల్డర్‌వీరెల్డ్‌ నుంచి వచ్చిన పాస్‌ను మిడ్‌ఫీల్డర్‌ హజార్డ్‌ గోల్ పోస్ట్ లోకి పంపి.. బెల్జియంకు నాలుగో గోల్‌ సాధించాడు. కొంత సమయం ఇరు జట్లకు అవకాశాలు వచ్చినా గోల్స్ గా మలచలేకపోయాయి. ఆట చివర్లో బెల్జియం ఆటగాడు మిచి గోల్‌ చేశాడు. ఇక ఇంజ్యూరీ సమయంలో ట్యునీషియా ఆటగాడు కజ్రి ఓదార్పు గోల్‌ చేసాడు. దీంతో 5-2తో ట్యునీషియా ఓటమిపాలయింది.

తొలి మ్యాచ్‌లో రెండు గోల్స్‌ సాధించిన రొమేలు లుకాకు ట్యునీషియాపై కూడా రెండు గోల్స్‌ సాధించాడు. నాలుగు గోల్స్‌తో ఈ ప్రపంచకప్‌ టాప్‌ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. తాజా విజయంతో బెల్జియం దాదాపు నాకౌట్‌ బెర్త్‌ ఖాయం చేసుకోగా.. ట్యునీషియా టోర్నీ నుండి నిష్క్రమించింది. 

Photo: FileShot