ప్రపంచకప్‌ నుంచి అర్జెంటీనా అవుట్‌

ప్రపంచకప్‌ నుంచి అర్జెంటీనా అవుట్‌

ఫిఫా ప్రపంచకప్‌ నుంచి అర్జెంటీనా జట్టు నిష్క్రమించింది. శనివారం జరిగిన తొలి నాకౌట్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో జరిగిన పోరులో అర్జెంటీనా 3-4 తేడాతో ఓటమి పాలైంది. గ్రూప్‌ దశలో వరుస విజయాలందుకున్న ఫ్రాన్స్‌ జట్టు తన జైత్రయాత్రను కొనసాగించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న ఫ్రాన్స్‌ యువ ఆటగాడు కైలియన్ మొబప్పె వరుసగా రెండు అద్భుత గోల్స్‌ సాధించి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. వరుసగా రెండు ప్రపంచకప్‌ల్లో క్వార్టర్స్‌కు చేరడం ఫ్రాన్స్‌కు ఇదే తొలిసారి.

మ్యాచ్ తోలి అర్థబాగం వరకు ఇరు జట్లు పోటాపోటీగా పోరాడాయి. అర్జెంటీనా ఆటగాడు మార్కస్‌ రోజో 11వ నిమిషంలో చేసిన ఫౌల్‌తో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది. ఈ అవకాశాన్ని 2016 యూరో కప్ హీరో ఆంటోనియో గ్రిజ్‌మన్ 13వ నిమిషంలో స్పాట్ కిక్‌తో ఫ్రాన్స్ గోల్ ఖాతా తెరిచాడు. అర్జెంటీనా ఆటగాడు ఏంజెల్ డి మారియా 41వ నిమిషంలో గోల్‌ చేయడంతో స్కోరు 1-1తో సమమయ్యాయి. తర్వాత ఇరు జట్లు పోరాడినా మరో గోల్ చేయకపోవడంతో ప్రథమార్థం 1-1తో ముగిసింది.

ద్వితీయార్ధంలో అర్జెంటీనా ఆటగాడు గాబ్రియేల్ మెర్కాడో 48వ నిమిషంలో గోల్‌ చేశాడు. దీంతో అర్జెంటీనా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 57వ నిమిషంలో ఫ్రాన్స్‌ ఆటగాడు బెంజమిన్‌ పెవార్డ్‌ గోల్‌ కొట్టడంతో స్కోర్లు 2-2తో సమమయ్యాయి. ఈ సమయంలో అనూహ్యంగా కైలియన్‌ మొబప్పె 64, 68వ నిమిషంలో సంచలన గోల్స్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 4-2కు పెంచాడు. దీంతో అర్జెంటీనా జట్టు కోలుకోలేకపోయింది. ఇంజురీ సమయంలో (90+ 2) సెర్గియో అగురో అర్జెంటీనాకు గోల్ సాధించినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌లో సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఒక్క గోల్‌ కూడా చేయకపోవడం అభిమానులకు నిరాశ కలిగించింది.