నాకౌట్‌కు డెన్మార్క్‌...

నాకౌట్‌కు డెన్మార్క్‌...

ఫిఫా ప్రపంచకప్‌లో రెండు వరుస విజయాలతో ఊపుమీదున్న ఫ్రాన్స్‌ను డెన్మార్క్‌ 0-0తో అడ్డుకుంది. ఫలితంగా గ్రూప్‌ ‘సి’ నుండి డెన్మార్క్‌ జట్టు నాకౌట్‌కు చేరింది. అయితే గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు విజయాలు, ఒక డ్రాతో ఏడు పాయింట్లు సాధించిన ఫ్రాన్స్‌ గ్రూప్‌ ‘సి’ నుండి టాపర్‌గా నాకౌట్‌కు చేరింది. డెన్మార్క్‌ ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

మ్యాచ్‌ ప్రారంభమయిన నాలుగో నిమిషంలోనే డెన్మార్క్‌కు పెనాల్టీకి అప్పీల్‌ అవకాశం వచ్చినా.. రెఫరీ పెనాల్టీకి అప్పీల్‌ను ఇవ్వకపోవడంతో గోల్ చేసే అవకాశం కోల్పోయింది. 15వ నిమిషంలో ఫ్రాన్స్‌ తరఫున ఒలివర్‌ గిరౌర్డ్‌ గోల్‌ ప్రయత్నాన్ని డెన్మార్క్‌ కీపర్‌ అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఇరు జట్లకు గోల్ చేసే అవకాశాలు వచ్చినా సద్వినియోగపరుచుకోలేదు. దీంతో ప్రథమార్ధం రెండు జట్లు గోల్‌ చేయకుండానే ముగించాయి. ఇక ద్వితీయార్ధం ప్రారంభం నుండే ఫ్రాన్స్‌ తమ దూకుడును ప్రదర్శించింది. 51వ నిమిషంలోనే గ్రిజ్‌మన్‌ లాంగ్‌ రేంజర్‌ షాట్‌ నేరుగా డెన్మార్క్‌ కీపర్‌ చేతుల్లోకి వెళ్లింది. 54వ నిమిషంలో ఫ్రీకిక్‌ను ఆడినా ఫలితం లేకపోయింది. ఇక 58వ నిమిషంలో, 78వ నిమిషంలో ఫ్రాన్స్‌ జట్టుకు అవకాశాలు వచ్చినా డెన్మార్క్‌ గోల్ కీపర్ అడ్డుకోవడంతో నిరాశే ఎదురైంది. ఇంజ్యూరీ టైమ్‌లో కూడా ఇరు జట్ల ఒక్క గోల్ చేయలేదు. దీంతో 0–0తో మ్యాచ్ డ్రా అయింది. 

Photo: FileShot