పాక్ పై కాదు, ఉగ్రవాద వ్యవస్థపై యుద్ధం

పాక్ పై కాదు, ఉగ్రవాద వ్యవస్థపై యుద్ధం

పాకిస్థాన్ లో నిర్వహించిన వైమానిక దాడుల గురించి వివరించేందుకు ప్రభుత్వం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. బాలాకోట్ లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడుల గురించి అమెరికా మంత్రి మైకెల్ పోంపో, పలుదేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడినట్టు సుష్మా ప్రతిపక్షాలకు తెలిపారు. తమ యుద్ధం పాకిస్థాన్ పై కాదని, ఉగ్రవాద వ్యవస్థను నిర్మూలించేందుకు యుద్ధం చేస్తున్నామని ఆమె చెప్పారు. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి అన్ని పార్టీల నేతలు సర్జికల్ స్ట్రైక్స్ పై ప్రభుత్వాన్ని అభినందించడం సంతోషంగా ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో మద్దతిస్తున్నట్టు నేతలంతా చెప్పినట్టు ఆమె ప్రకటించారు.

అన్ని పార్టీలు ప్రభుత్వ చర్యను సమర్థించాయి. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు సాయుధ దళాల ప్రయత్నాలను అభినందించినట్టు కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ తెలిపారు. దేశం నుంచి ఉగ్రవాదాన్ని పారదోలేందుకు వారికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. కేవలం ఉగ్రవాదులు, ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా చక్కగా ఆపరేషన్ నిర్వహించారని.. ఎక్కడా పౌరుల ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా జరిపినందుకు ఐఏఎఫ్ ను అభినందించారు.