బాపు జయంతి స్పెషల్...

బాపు జయంతి స్పెషల్...

ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకోదగ్గ దర్శకుల్లో బాపు ముందువరుసలో ఉంటారు.. గీతకారుడు, సంగీతకారుడు, కార్టూనిస్టాగరిస్టు, చిత్ర దర్శకుడు ఇలా.. అన్ని రంగాల్లో ఆయన శైలి ప్రత్యేకం.. ఓ దృశ్యాన్ని తెరకెక్కించాలంటే.. ముందుగా కార్టూన్‌ రూపంలో గీసి.. ఆ తర్వాత షూట్ చేయడం ఆయన ప్రత్యేకత. అంతా ముందుగా బాపు అనే పిలుచుకునే సత్తిరాజు లక్ష్మీనారాయణ.. 1933 డిసెంబర్ 15 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. ముందు అడ్వర్టైజింగ్ రంగంలో, ఆ పై పత్రికా రంగంలో పనిచేసి, అక్కడ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఆయన సినిమాలు చేస్తూనే, చిత్రకళ, కార్టూన్ కళ రెండింటినీ సమానంగా సుసంపన్నం చేసారు. తెలుగునాట ఏ రచయిత అయినా తన పుస్తకానికి బాపు ముఖచిత్రం వుండాలనే కోరుకునేవారంటే అతిశయోక్తి కాదు... ఆ సమయంలో తొంభై శాతానికి పైగా తెలుగు నవలలకు ఆయనే ముఖచిత్రకారుడంటే ఆయనలోని ప్రతిభ ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

సినిమాలపై ఎలాంటి అవగాహన లేకుండానే సినీ పరిశ్రమలు అడుగుపెట్టి.. తొలిచిత్రం 'సాక్షి'తోనే అందరి దృష్టి తనవైపు తిప్పుకునేలా చేసిన ప్రతిభాశాలి బాబపు... తన దైన శైలిలో సినిమాలు తీయడమే కాకుండా, తీసిన వాటిన్నింటిలో తనదైన ముద్రను స్పష్టంగా కనబర్చారు బాపు. 51 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయనను ఎన్నో అవార్డులు వరించాయి.. ఐదు సార్లు నంది అవార్డులు, రెండు సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 1986లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2013లో పద్మశ్రీ అవార్డులు వరించాయి. ఇక, తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. సాక్షి (1967)తో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం శ్రీరామరాజ్యం (2011) వరకు సాగింది.. బంగారు పిచిక, బుద్ధిమంతుడు, ఇంటిగౌరవం, సంపూర్ణ రామాయణం, అందాల రాముడు, శ్రీ రామాంజనేయ యుద్ధం, సీతా కల్యాణం, భక్త కన్నప్ప, స్నేహం, గోరింత దీపం, మనవూరి పాండవులు, తూర్పు వెళ్లే రైలు, రాధా కల్యాణం, కృష్ణావతారం, పెళ్లి పుస్తకం, పెళ్లికొడుకు, రాధా గోపాళం, సుందరకాండ.. ఇలా ఆయన సినీ ప్రస్థానం కొనసాగింది.

విద్యారంగానికి విశేష కృషి చేశారు బాపు.. 1986-88 వరకూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కోరిక మేరకు రాష్ట్రంలోని ప్రాథమిక స్థాయి విద్యార్థుల కోసం బాపు ముళ్ళపూడి వెంకట రమణలు పాఠ్యాంశాలను దృశ్య శ్రవణ మాధ్యమం లోనికి మార్చారు. విద్యా రంగంలో ఒక వినూత్న ప్రయత్నంగా ప్రారంభించారు. బాపు వయోజన విద్య కోసం కూడా పాఠ్యాంశాలను సిద్ధపరచారు. బాలల దృష్టి లో ప్రపంచాన్ని ఎలా చూస్తారో బుడుగు పాత్రను సృ ష్టించారు, తెలుగు సాహిత్యం లోనే ఒక మకుటాయమానంగా నిలిచిపోయింది. దక్షిణాధిలోని ప్రముఖ ప్రచురణ సంస్థలకు అనేక గ్రంధాలకు అవసరమైన చిత్రాలను చిత్రించగా వాటిలో ఐదింటికి ప్రభుత్వం బహుమతులను అందుకుంది... ఇక, ముళ్లపూడి వెంకటరమణ గురించి లేకుండా బాపు జీవితం పరిపూర్ణం కాదు. ఇద్దరూ స్నేహానికి నిర్వచననంగా తెలుగునాట నిలిచారు. శ్రీరామరాజ్యం సినిమా నిర్మాణంలో ఉన్న సమయంలో ముళ్లపూడి వెంకటరమణ కన్నుమూశారు... అదే వారి ఆఖరి సినిమాగా నిలిచింది... అప్పటి నుంచి బాపు మానసికంగా, ఆపై శారీరకంగా బాగా తగ్గిపోయారని చెబుతారు... అలా 2014 ఆగస్టు 21వ తేదీన బాపు కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక బాపు జయంతిని పురస్కరించుకుని శిఖరం ఆర్ట్‌ థియేటర్స్‌, త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో ఇవాళ ‘సంపూర్ణ రామాయణం’ సినిమా ప్రదర్శించనుంది.. అనంతరం పురస్కారాల ప్రదానం ఉంటుంది. ఇక, నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రముఖ ‘ముఖ’చిత్ర చిత్రకారుడు శంకర్‌ నారాయణకు బాపు అవార్డు, ప్రఖ్యాత రచయిత-సినీ దర్శకుడు వంశీకి రమణ అవార్డు ప్రదానం చేయనున్నారు. కేవీ రమణాచారి, తనికెళ్ల భరణి, ఓలేటి పార్వతీశం, జొన్నవిత్తుల రామ లింగేశ్వరరావు, దివ్యవాణి తదితరలు హాజరుకానున్నారు.