సీతారామ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి

సీతారామ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి

సీతారామ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతిని కేంద్ర అటవి పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డా. యస్. కర్కెట్ట నుండి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వి.  సుధాకర్ కు లేఖ అందింది. గత సంవత్సరం నవంబర్ 27న జరిగిన ఈ‌ఏ‌సీ సమావేశంలో సీతారామ ప్రాజెక్టుకు తుది పర్యావరన అనుమతిని మంజూరు చేయమని సిఫారసు చేసింది. వారి సిఫారసు మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది అనుమతిని జారీ చేసింది.

దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నుండి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 1,33,085 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు మరియు 1,39,836 హెక్టార్ల స్థిరీకరణకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. మొత్తం 2,72,921 హెక్టార్ల భూమికి సాగు నీరు అందుతుంది. మూడు జిల్లాల్లో దాదాపు 180 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరు అంధించడంతో పాటు దారి పొడుగునా చిన్న నీటి చెరువులను నింపడం, పూర్తి అయిన ప్రాజెక్టులకు నీటి సరఫరా చేయడం జరుగుతుంది. ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి పొందడానికి గత సంవత్సరం ఆగస్టు నెలలో మూడు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది.

సీతారామ ప్రాజెక్టుకు మొత్తం 8,476 హెక్టార్ల భూమి అవసరం ఉండగా అందులో 1,531 హెక్టారాల అటవీ భూమి ఉంది. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 13,384.80 కోట్లు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మూడేళ్ళల్లో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసింది. సాగు నీటి శాఖ సమర్పించిన పర్యావరన నివేదికను ఈ‌ఏ‌సి కూలంకషంగా పరిశీలించిన పిదప సాగునీటి శాఖ అధికారులు ఇచ్చిన వివరణలకు సంతృప్తి చెంది ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి మంజూరు చేయవలసిందిగా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది.

వారి సిఫారసు మేరకు పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ 2006కి లోబడి మంత్రిత్వ శాఖ ఈ నెల 7వ తేదీన తుది పర్యావరణ అనుమతిని మంజూరు చేస్తూ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరు కు లేఖ రాసింది. ఈ అనుమతి పదేళ్ళ వరకు మనుగడలో ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం అనంతరం డిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ ని కలిసి ప్రాజెక్టుకు పర్యవరన అనుమతిని మంజూరు చేయమని కోరారు. పర్యావరణ అనుమతిని మంజూరు చేసినందుకు గాను సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.