అమీర్‌పేట్‌-హైటెక్ సిటీ మెట్రోకు తుది ఏర్పాట్లు..

అమీర్‌పేట్‌-హైటెక్ సిటీ మెట్రోకు తుది ఏర్పాట్లు..

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టులో అత్యంత కీలకంగా భావిస్తున్న అమీర్‌పేట్ - హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులను ప్రారంభించడానికి తుది ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ మార్గంలో రైళ్లు నడిపేందుకు మార్గం సుగమం చేస్తూ.. కమీషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్ఎస్) తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ కారిడార్‌లో మెట్రో రైళ్లు నడపడానికి గత నవంబర్ మాసం నాటికే అన్ని నిర్మాణాలు పూర్తికాగా.. నాలుగు నెలలుగా ఈ కారిడార్‌లో ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే, ప్రయాణికుల కోసం రైళ్లు నడపడానికి సీఎంఆర్ఎస్ అనుమతి తప్పనిసరి కావడంతో మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు ఇంతకాలం వేచి చూశారు. తాజాగా ఆ అనుమతి రావడంతో ఆ రూట్లలో ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి హడావుడి, ప్రచారం, ఆర్భాటం లేకుండా సాదాసీదాగానే ఈ రూట్ లో మెట్రో రైళ్ల సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు. దీంతో కొద్ది రోజుల్లోనే హైటెక్ సిటీ మార్గంలో రైలు సేవలను అందుబాటులోకి తేవాలని మెట్రో రైలు అధికారులు తుది ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్గంలో అమీర్ పేట, మధురానగర్, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్లు ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో సేవలు అందుతున్నట్లు లెక్క. 29 కిలోమీటర్ల మియాపూర్ - ఎల్.బి. నగర్ లైను, 17 కిలోమీటర్ల నాగోల్ - అమీర్‌పేట్‌ లైన్.. ఇప్పటికే ప్రారంభం కాగా.. 10 కిలోమీటర్ల అమీర్ పేట-హైటెక్ సిటీ మార్గంలో సర్వీసులు మొదలైతే... మొత్తం 56 కిలోమీటర్ల నిడివి కలిగిన మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది.ఈ రూట్‌లో సర్వీసులు ప్రారంభమైతే.. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు చాలా ఉపయోగం కానుంది. నగరంలోని నలుమూలల నుంచి వీరు పనిచేసే ప్రాంతాలకు వస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మార్గంలో రైళ్లు నడపడానికి మార్గం సుగమం కావడంతో వారికి ఎంతో ఊరట లభిస్తుంది.