కాసేపట్లో ఉత్కంఠకు తెర

కాసేపట్లో ఉత్కంఠకు తెర

దేశం మొత్తం ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో గెలిచేదెవరు? ఓడేదెవరు? 42 రోజుల నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. కేంద్రంలో మోడీని మళ్లీ ప్రజలు ఆశీర్వదిస్తారా? రాహుల్‌కు పట్టం కడతారా? ఏపీలో చంద్రబాబుకు మరో అవకాశం ఇస్తారా? జగన్‌కు జై కొడతారా? పార్లమెంట ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ దూసుకెళ్తుందా?  వీటన్నింటికీ మరికొన్ని గంటల్లో జవాబు రానుంది. 

ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 34 కేంద్రాల్లో 55 కేంద్రాల్లో కౌంటింగ్‌ జరుగుతుంది. 25వేల మంది ఈ లెక్కింపు ప్రక్రియలో పాల్గొనబోతున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 15 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి లో 18 జిల్లాల్లో 35 కేంద్రాలను ఏర్పాటుచేశారు.  రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.  

తొలిసారిగా ఈసారి ఈవీఎంలతోపాటు వీవీప్యాట్‌లు కూడా లెక్కించబోతున్నారు. ముందుగా ఈవీఎంలను లెక్కించిన తర్వాత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ద్వారా లాటరీ తీసి ఎంపిక చేసిన 5 వీవీప్యాట్ల లెక్కింపు చేపడతారు.