పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. రెండు విడతల్లో సమావేశాలు నిర్వహించనున్నట్టు లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది. మొదటి విడతలో 11, రెండో విడలతో 24 చొప్పున... మొత్తం 35 సిట్టింగ్స్ ఉంటాయి. ఈ నెల 29న పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. తొలి రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఎకనమిక్ సర్వేను విడుదల చేస్తుంది ప్రభుత్వం. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ని సభలో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 15 వరకు తొలి విడత సమావేశాలు జరుగుతాయి. తర్వాత 20 రోజుల విరామం ఉంటుంది. తిరిగి మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకూ పార్లమెంట్ రెండో విడత సమావేశాలు జరుగుతాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఏడు రోజుల పాటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగాయి. పలువురు ఎంపీలకు కరోనా వైరస్ సోకవడంతో... ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కరోనా విజృంభణ వల్ల నవంబర్, డిసెంబర్లలో జరగాల్సిన శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)