ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త, 8.65% వడ్డీకి గ్రీన్ సిగ్నల్!!

ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త, 8.65% వడ్డీకి గ్రీన్ సిగ్నల్!!

ఆర్థిక సంవత్సరం 2018-19కి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 8.65 శాతం వడ్డీ ఇచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ అమోదం తెలిపింది. ఈ వడ్డీరేటు నిర్ణయం రిటైర్మెంట్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చేసింది. ఈ నిర్ణయంతో అసంఘటిత రంగంలోని సుమారు 6 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 

'ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఒక విభాగమైన డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) ఈపీఎఫ్ఓ నిర్ణయానికి తన సమ్మతి ఇచ్చింది. ఆర్థిక సంవత్సరం 2018-19కి చందాదారులకు 8.65 శాతం వడ్డీ రేటు ఇవ్వాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించిందని' విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ పేర్కొంది. కొన్ని షరతులతో ఈ ప్రతిపాదనను డీఎఫ్ఎస్ మంజూరు చేసింది. ఈ షరతులు రిటైర్మెంట్ ఫండ్ సమర్థవంతమైన నిర్వహణకు సంబంధించినవి. 

ఇంతకు ముందు ఫిబ్రవరి నెలలో ఈపీఎఫ్ఓలోని అత్యున్నత విధాన నిర్ణయ యూనిట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆర్థిక సంవత్సరం 2018-19కి ఈపీఎఫ్ వడ్డీ రేటు పెంచి 8.65 శాతం చేయాలని నిర్ణయించింది. గత మూడేళ్లలో మొదటిసారి వడ్డీరేటు పెంచడం జరిగింది. ఈపీఎఫ్ పై గత ఆర్థిక సంవత్సరం 2017-18లో 8.55 శాతం మాత్రమే ఉన్న వడ్డీరేటును ఇప్పుడు 8.65 శాతం చేశారు. అంతకు ముందు ఈపీఎఫ్ఓ ఆర్థిక సంవత్సరం 2016-17 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లు తగ్గించి 8.65 శాతం చేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేటు 8.8 శాతం ఉండేది.