వెబ్ సిరీస్ తాండవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు..

వెబ్ సిరీస్ తాండవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు..

బాలీవుడ్ స్టార్ హీరో ఇటీవల తాండవ్ అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించాడు. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేశారు. అయితే ఈ వెబ్‌ సిరీస్‌లోని కొన్న సన్నివేశాలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనిని బ్యాన్ చేయాలని దుమారం లేచిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా దీనికి వ్యతిరేకంగా బాయ్‌కాట్ తాండవ్ అని నినాదాలు కూడా వినిపించాయి. ఈ వెబ్ సిరీస్‌లో హిందువులు పూజించే దేవుడు మహాశివుడిని కించపరిచే విధమైన సన్నివేశాలు ఉన్నాయని, స్ట్రీమింగ్ సంస్థలు కావాలనే హిందూ దేవుళ్లను టార్గెట్ చేస్తున్నాయని కొందరు అన్నారు. కొందరు రాజకీయ నాయకులు కూడా తాండవ్‌కు వ్యతిరేకంగా స్పందించారు. అంతేకాకుండా బీజేపీ ఎమ్మేల్యే రామ్‌కదమ్ తాండవ్ వెబ్ సిరీస్‌పై ముంబైలోని ఘట్కోర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు కేంద్రమంత్రి ప్రకాస్ జవదేకర్‌కు లేఖ రాశారు. ఇందులో హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఉండటంతో పాటుగా మాదక ద్రవ్యాలు, శృంగారం, హింస వంటి వాటిని ఎక్కువగా చూపించారని, దీని ద్వారా దేశంలోని యువత తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా లక్నో‌లో కూడా దీనిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రిత్వ శాఖ అమెజాన్‌ ప్రైమ్‌కు నోటీసులు జారీ చేసింది. ఇదే విధంగా కొనసాగితే ఈ వెబ్‌సిరీస్‌కు బ్రెకులు పడటం ఖాయం. మరి దీనిపై అమెజాన్ ప్రైమ్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.