గ్యాస్ బండ కన్నా కట్టెల పొయ్యే నయం

గ్యాస్ బండ కన్నా కట్టెల పొయ్యే నయం

వాతావరణ కాలుష్యం, ప్రజారోగ్యం వంటి కారణాలు సరే.. మరి ధర సంగతేంటి? ఇక్కడే చాలా మంది గ్రామీణ మహిళలు వంటగ్యాస్ సిలిండర్ ను వాడటం లేదు. ప్రధాని మోడీ ఎంతో గొప్పగా "ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన" పథకాన్ని 2016లో గృహిణుల కోసం తీసుకొచ్చి వంట గ్యాస్ వాడకం మీద ప్రత్యేక శ్రద్ధ చూపారు. పొగ లేని వంట కాబట్టి మహిళలు కూడా సిలిండర్ల కోసం క్యూలు కట్టి మరీ తీసుకున్నారు. అయితే గ్యాస్ స్టవ్ ను తొలి 2,  3 నెలల వరకే వాడి ఆ తరువాత అటకెక్కించారని తాజాగా బయటపడింది.

ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ వంటి పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా ఎకనామిక్ టైమ్స్..  పలు ప్రాంతాల్లో ఫీల్డ్ టూర్ చేసింది. అందులో తేలిన వివరాల ప్రకారం రూరల్ ఏరియాల్లో చాలా మంది మహిళలు సిలిండర్లు ఉంచుకొని కూడా వాటిని వాడటం లేదు. కారణమేంటని ఆరా తీస్తే... చాలా మంది చెప్పిన అభిప్రాయం దాని కొనుగోలు ధరను తాము భరించలేకపోతున్నామని. ఒక సిలిండర్ ధర దాదాపు రూ. 900 పలుకుతోంది. దాని కంటే తమకు అడవిలో దొరికే కట్టెలే ఎంతో చవకని వారు చెబుతున్నారు. ఒకవేళ ఎండుకర్రలు అందుబాటులో లేనివారు పిడకల్ని ఆశ్రయిస్తున్నారు. పిడకల ధర రూ. 600 కు పైగా పలుకుతోంది. దాంతో దాదాపు 3 నెలల దాకా వంట చేసుకుంటామని, అదే వంట గ్యాస్ అయితే 2 నెలలు మాత్రమే వస్తుందని వారంటున్నారు. 

ఆడపడుచులు పొగతో ఇబ్బందులు పడరాదని ప్రధాన మంత్రి ఎంతో శ్రద్ధతో తీసుకొచ్చిన పథకం కాస్తా ధర కారణంగా గ్రామీణ మహిళలు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఫలితంగా వారి ఇళ్లన్నీ పొగ చూరిపోయి కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా ఓపిక చేసుకొని సిలిండర్ కోసం వెళ్లినా.. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర గంటలకొద్దీ వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇక పాత తరానికి చెందిన వృద్ధ మహిళలకు సిలిండర్ స్టవ్ ను ఎలా ఉపయోగించాలో తెలియక వాటిని వాడటం మానేశారు. అందరికీ అందుబాటులో ధరల్లో ఉంచేందుకు 5 కిలోల సిలిండర్లపై దృష్టి సారించామని కేంద్రం చెబుతోంది. మరి మారుమూల గ్రామాల్లో ఉంటున్న మహిళల కోసం ధరలు సడలించి, సిలిండర్ వాడకాన్ని ప్రోత్సహిస్తారా.. లేక ఇచ్చిందే పదివేలని చేతులు దులుపుకుంటారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 

(Photos and inputs: The Economic Times)