బ్లాక్ హోల్ మొట్టమొదటి చిత్రాలు వచ్చేశాయి

బ్లాక్ హోల్ మొట్టమొదటి చిత్రాలు వచ్చేశాయి

ప్రపంచ విజ్ఞాన చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. చరిత్రలో మొట్టమొదటిసారి ఒక బ్లాక్ హోల్ (కృష్ణ బిలం)ని ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ఒక పెద్ద వార్తను చెప్పబోతున్నామని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ(ఈఎస్ఓ) ఈ వారం ఆరంభంలో సూచనప్రాయంగా తెలిపింది. అంతర్జాతీయ సహకారంతో నిర్మించిన ఈవెంట్ హొరైజన్ టెలిస్కోప్ (ఈహెచ్ టి) ప్రాజెక్ట్ ఈ అద్భుత ఘట్టానికి సంబంధించిన మొదటి చిత్రాలను అందజేయనుంది. 

ఈహెచ్ టి ప్రాజెక్ట్ ఈ ఒకేఒక్క కార్యక్రమంపైనే అనేక ఏళ్లుగా పనిచేస్తోంది. పాలపుంతకి నడి మధ్యన ఉన్న సాజిటేరియస్ ఏ* అనే అతిభారీ బ్లాక్ హోల్ తర్వాత వెంటనే ఉన్న వాతావరణం తాలూకు ఛాయాచిత్రాలను ఒడిసి పట్టేందుకు నిర్విరామంగా కృషి చేస్తోంది. మన భూగోళానికి సుమారు 50 మిలియన్ కాంతి సంవత్సరాల కంటే కాస్త ఎక్కువ దూరంలో ఉన్న గెలాక్సీ మెస్సీయర్ 87  అనే మరింత పెద్ద బ్లాక్ హోల్ గురించి సమాచారం సేకరించేందుకు ప్రయత్నించడం కూడా ఈహెచ్ టి అజెండాలో ఉంది. 

ఈఎస్ఓ ప్రకటనను చాలా వార్తాపత్రికలు, వార్తాసంస్థలు గాలిమాటలుగా కొట్టి పారేశాయి. అయితే నిపుణులు మాత్రం ఈహెచ్ టి పరిశోధకులు అసాధ్యం అనుకున్నదేదో సాధించారని ఊహించారు. ఊహించినట్టుగానే బ్లాక్ హోల్ ఏర్పడే మొదటి ప్రతక్ష ఫోటోగ్రాఫ్ ని కెమెరాలో బంధించి ప్రపంచానికి విడుదల చేయడం జరిగింది. 

బ్లాక్ హోల్ అంతర్గత ఛాయాచిత్రాలు తీయడం అసాధ్యం. ఎందుకంటే కృష్ణబిలం తన క్షితిజానికి సమీపంలోకి వచ్చిన ఎలాంటి కాంతినైనా తన అత్యంత బలమైన గురుత్వాకర్షణ శక్తితో లాగేసుకుంటుంది. దాంతో అది ఎప్పటికీ కనిపించకుండా అదృశ్యమవుతుంది. అయితే ఈహెచ్ టి ప్రాజెక్ట్ తన గ్లోబల్ టెలిస్కోప్ నెట్ వర్క్ తో బ్లాక్ హోల్ లోని ఈ ప్రత్యేక భాగాన్ని కెమెరాలో బంధించగలమని ధీమాగా ఉంది.