కేంద్రానికి దీదీ చురకలు.. ఢిల్లీని చక్కదిద్ది బెంగాల్‌కు రండి..!

కేంద్రానికి దీదీ చురకలు.. ఢిల్లీని చక్కదిద్ది బెంగాల్‌కు రండి..!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. పశ్చిమ బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించిన భారతీయ జనతా పార్టీ.. తరచూ ఆ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు, బీజేపీ కేంద్ర నాయకత్వం పర్యటించేలా ప్లాన్ చేస్తుంది. అయితే, కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేశారు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ... జనవరి 26వ తేదీన రైతుల ర్యాలీలో చోటు చేసుకున్న ఘటనలపై స్పందించిన ఆమె.. ఢిల్లీలో పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత బెంగాల్‌ గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఎద్దేవా చేశారు.. ఢిల్లీలో పరిస్థితిని అదుపు చేయలేకపోయారని విమర్శించిన దీదీ.. ఢిల్లీలో జరిగిన ఘటనలకు మోడీ ప్రభుత్వం, బీజేపీ దీనికి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఇక, అలాంటి ఘటనలే బెంగాల్‌లో జరిగి ఉంటే.. ఎందుకు కట్టడిచేయలేక పోయారంటూ.. హోంమంత్రి అమిత్‌ షా భయ్యా అడిగేవారంటూ సెటైర్లు వేసిన మమతా.. ముందు అక్కడ పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. మరోవైపు ఢిల్లీలో జరిగిన హింసను ఖండించిన దీదీ.. వ్యవసాయ చట్టాలను బలవంతంగా ఆమోదించారని గుర్తు చేశారు.. తమకు ఆ చట్టాలు వద్దంటూ రైతులు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారని.. చివరకు తమ సహనాన్ని కోల్పోయే పరిస్థితి కూడా వచ్చిందన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలి లేదా అధికార పీఠం నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు మమతా బెనర్జీ.