పండగ టైంలో భారీ ఆఫర్లు.. పోటీపడుతోన్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ..!

పండగ టైంలో భారీ ఆఫర్లు.. పోటీపడుతోన్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ..!

కరోనా సమయంలో బయటకు వెళ్లి షాపింగ్‌ చేసేవాళ్ల సంఖ్య తగ్గిపోయింది.. ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటున్నా.. గతంలో ఉన్నస్థాయిలోమాత్రం లేదు. ఇదే సమయంలో.. ఈ-కామర్స్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయాల్లా సాగుతోంది. ప్రతీసారి పండగ సీజన్‌లో ప్రత్యేక ఆఫర్లు, స్పెషల్ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకోవానికి ఈ-కామర్స్ సంస్థలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.. ఇక, ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ పండగ సీజన్‌ వచ్చిందంటే చాలు.. భారీ డిస్కౌంట్లతో తమ సేల్స్‌ను అమాంతం పెంచుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌తో ముందుకు రానుండగా.. అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’తో వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి రెండు సంస్థలు. 

ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌లో టీవీలు, ఇతర లార్జ్ అప్లయెన్సెస్‌పై 80 వరకు తగ్గింపుతోపాటు అప్లయెన్స్‌కు పూర్తిస్థాయి ప్రొటెక్షన్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం కల్పిస్తోంది.. ఇక, ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపైనా 80 శాతం రాయితీ ప్రకటించగా.. ఈ కేటగిరీలో మొత్తం మూడు కోట్ల ఉత్పత్తులను, 2 లక్షలకు పైగా ప్రైవేటు బ్రాండ్‌లను లిస్ట్ చేసింది.. వీటిపై 80 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఇక, అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మొబైల్స్, యాక్సెసరీలపై భారీ ఆఫర్లు తెస్తుంది. నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌చేంజ్ రాయితీ, టోటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, ఎక్స్‌‌చేంజ్‌పైనా భారీ తగ్గింపును ఆఫర్లు, స్పెషల్ లాంచెస్ కేటగిరీలో ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 

మరోవైపు పాత వస్తువుల ఎక్స్‌చేంజ్‌పై రూ. 13,500 వరకు తగ్గింపు, బజాజ్ ఫిన్‌సెర్వ్ క్రెడిట్, డెబిట్ కార్డులపై నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ చేస్తోంది. బజాజ్ ఫిన్‌సెర్వ్ లక్ష రూపాయల వరకు రుణ పరిమితి కూడా ఇస్తోంది. హోం, కిచెన్ ఉత్పత్తులపై 60 శాతం, దుస్తులు, యాక్సెసరీలపై 70 శాతం, ఫుడ్, గౌర్మెట్ కేటగిరీలో 50 శాతం వరకు డిస్కౌంట్లు ఇవ్వనున్నట్టు అమెజాన్ ప్రకటించింది. ఇక, వీటికి అదనంగా.. తమతో భాగస్వామ్యం అయిన బ్యాంకులకు సంబంధించిన డెబిట్, క్రెడిట్‌ కార్డులపై మరింత రాయితీ పొందవచ్చు.. ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఫ్లిప్‌కార్ట్.. ఆ బ్యాంక్‌కు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ రాయితీ అందించనుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో ఎంవోయూ కుదుర్చుకున్న అమెజాన్.. ఆ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ రాయితీ ఇవ్వనుంది. అయితే, పండుగ సీజన్‌లో వస్తున్న ఈ స్పెషల్‌ సేల్స్‌కు సంబంధించిన తేదీలను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ ప్రకటించాల్సి ఉంది.