వాల్‌మార్ట్ చేతికి ఫ్లిప్‌కార్ట్

వాల్‌మార్ట్ చేతికి ఫ్లిప్‌కార్ట్

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకోవడానికి రెండు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు పోటీ పడడంతో చివరకు ఫ్లిప్‌కార్ట్‌ను ఎవరు చేజిక్కించుకుంటారనే ఆసక్తి నెలకొన్ని సంగతి తెలిసిందే... ఓ వైపు అమెజాన్... మరోవైపు వాల్‌మార్ట తీవ్రంగా పోటీ పడగా... చివరకు ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ సొంతం చేసుకుంది. తన సంస్థలో 75 శాతం వాటాను వాల్‌మార్ట్‌కు అమ్మే ప్రతిపాదనకు ఫ్లిప్‌కార్ట్ బోర్డు ఆమోదం తెలిపింది. 15 బిలియన్ డాలర్ల డీల్‌కు బోర్డు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అంటే సుమారు లక్ష కోట్లకు డీల్ కుదిరిందన్నమాట. 

ఇక ఈ డీల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో తమ 20 శాతం వాటాను జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ రూపంలో విక్రయించనుంది. ఈ డీల్‌కు సంబంధించిన వ్యవహారాలు మరో 10 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌తో కలిసి ఆల్ఫాబెట్ పెట్టుబడి పెట్టే అవకాశాలున్నాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఫ్లిప్‌కార్ట్‌లో 60 శాతం వాటా కోసం పోటీపడుతూ వచ్చిన అమెజాన్... 75 శాతం వాటాను వాల్‌మార్ట్ సొంతం చేసుకోవడంతో పోటీ నుంచి తప్పకున్నట్లయింది. ప్రపంచంలోనే అతిపెద్ద రీటెయిలర్‌గా పేరున్న వాల్‌మార్ట్‌కు అమెజాన్ నుంచి గట్టి పోటీ ఇచ్చింది... ఇక ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకోవడంతో వాల్‌మార్ట్ నుంచి అమెజాన్‌కు పోటీ ఏర్పడనుందంటున్నారు.