ఓలాలో రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టిన సచిన్ బన్సల్

ఓలాలో రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టిన సచిన్ బన్సల్

ఆన్ లైన్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ఇప్పుడు యాప్ బేస్డ్ క్యాబ్ కంపెనీ ఓలా సవారీ చేయడానికి సిద్ధమయ్యారు. ఫ్లిప్ కార్ట్ వదిలేసిన సచిన్ దేశీయ ట్యాక్సీ యాగ్రిగేటర్ సంస్థ ‘ఓలా’లో రూ.150 కోట్లు పెట్టుబడి పెట్టారు. సచిన్ ఓలాను నడిపే ఏఎన్ఐ టెక్నాలజీలో 70,588 కంటే ఎక్కువ జే సిరీస్ షేర్లను కొనుగోలు చేవారు. ప్రతి షేరుకి సచిన్ రూ.21,250 చెల్లించారు. ఓలాలో సాఫ్ట్ బ్యాంక్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. సచిన్ పెట్టుబడితో కంపెనీ మార్కెట్ విలువ 5.7 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది వాల్ మార్ట్ కి ఫ్లిప్ కార్ట్ లో వాటా అమ్మిన తర్వాత బన్సల్ కి బిలియన్ డాలర్లు దక్కాయి. వాల్ మార్ట్ 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్ కార్ట్ లో 77% వాటాను కొనుగోలు చేసింది. సచిన్ బన్సల్ ఓలాలో దాదాపుగా రూ.650 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. అందులో రూ.150 కోట్లు మొదటి విడతగా భావిస్తున్నారు. 

భారత్ లో 100 నగరాల్లో ఓలా కార్యలాపాలు నిర్వహిస్తోంది. భారత మార్కెట్ లో ఊబర్ ఓలాకి గట్టి పోటీ ఇస్తోంది. ఓలా ఇతర దేశాల్లో కూడా కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. సెప్టెంబర్ 2018లో యుకెలో సేవలు ప్రారంభించింది. అంతకు 6 నెలల ముందు ఆస్ట్రేలియాలో బిజినెస్ ఆరంభించింది.