ప్రాణాలకు తెగించి కాపాడుతున్న సహాయక సిబ్బంది

ప్రాణాలకు తెగించి కాపాడుతున్న సహాయక సిబ్బంది

కేరళలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 87కు చేరింది. పాలక్కడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఏడుమంది మృత్యువాతపడ్డారు. వాతావరణశాఖ అధికారులు రాష్ట్రంలోని 14 జిల్లాల్లో అత్యంత ప్రమాదకరస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో మెట్రో, రైళ్ల సేవలను కూడా రద్దు చేశారు.

వర్షపు నీరు రాకతో పెరియార్‌ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలోని ముల్లపెరియార్‌, చెరుతోని, ఇడుక్కి, ఇదమలయార్‌తో సహా ఇతర ప్రధాన జలాశయాల గేట్లన్నింటినీ ఎత్తివేశారు. దీంతో పల్లపు ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలకు దినదిన గండంగా మారింది. అత్యంత ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస శరణాలయాలకు తరలించారు. దాదాపు 1.5లక్షల మంది పునరావాస కేంద్రాల్లో నివసిస్తున్నారు. కేంద్ర బలగాలు సహాయ చర్యలను వేగవంతం చేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కేరళ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరాతీశారు. ఈరోజు ఉదయం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మరోసారి ఫోన్‌ లో మాట్లాడారు.