దుబ్బాక ఫలితం తర్వాత ఇంఛార్జ్‌ను పట్టించుకోని నేతలు?

దుబ్బాక ఫలితం తర్వాత ఇంఛార్జ్‌ను పట్టించుకోని నేతలు?

ఇక ఆగేదే లేదు. దూకుడుగా వెళ్లడమే అని ఊదరగొట్టారు. వచ్చిన కొత్తలో నేను ఒక్కసారి చెప్తే.. వందసార్లు చెప్పినట్టే అని ఓ రేంజ్‌లో డైలాగులు వినిపించారు. ఇప్పుడు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో సారుకి ఏమైంది అని అనుకోవడం నాయకుల వంతైంది.

పార్టీ నాయకులతో ఫ్రీగా మాట్లాడే పరిస్థితి లేదా? 

అంతన్నాడింతన్నాడే గంగరాజు అని AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ను తలచుకుని పాటలు పాడుకుంటున్నారట తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు. రాష్ట్రానికి పార్టీ ఇంఛార్జ్‌గా వచ్చిన కొత్తలో..రాహుల్‌ గాంధీకి ఠాగూర్‌ ఎంత చెబితే అంత అని ప్రచారం జరిగింది. తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టడానికే ఆయన వచ్చారని అనుకున్నారు. మరో మాట లేకుండా... రొటీన్‌కు భిన్నంగా నాయకులంతా ఇంఛార్జ్‌ మాటే ఫైనల్‌గా భావించి ఆయన చెప్పిన.. సూచించిన బాటలో నడిచారు. అయితే దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తర్వాత ఠాగూర్‌ ఇమేజ్‌కు మచ్చ పడిందన్నది పార్టీ వర్గాల టాక్‌. పీసీసీకి కొత్త చీఫ్‌ ఎంపిక ప్రక్రియ మొదలయ్యాక ఆ మచ్చ ఇంకాస్త పెరిగిందట. ఇప్పుడు రాష్ట్రంలోని ముఖ్య నాయకులతో ఆయన మనసువిప్పి మాట్లాడే పరిస్థితి లేదని చర్చ జరుగుతోంది. 

కోర్‌ కమిటీ సమావేశాల ఊసే లేదా? 

తెలంగాణలో ఏ కార్యాచరణ చేపట్టిన.. కోర్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. ప్రతి 15 రోజులకు ఖచ్చితంగా కోర్ కమిటీ సమావేశం ఉంటుంది.. అని వచ్చిన కొత్తలో ఠాగూర్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఒకటి రెండు సమావేశాలు జరిగాయి తప్పితే.. కోర్ కమిటీ అనేది ఒకటి ఉందన్న ఊసే మర్చిపోయారు. పీసీసీ అభిప్రాయ సేకరణ జరిగినప్పటి నుంచి.. ఇప్పటి వరకు తెలంగాణకి వచ్చిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ నాయకులు ఇబ్బడిముబ్బడిగా వాడే జూమ్ మీటింగ్‌లు కూడా లేవు. 

కాంగ్రెస్‌లో ఎన్నికల అలికిడే లేదా? 

పీసీసీకి కొత్త చీఫ్‌ నియామకం వాయిదా పడింది. కాంగ్రెస్‌కి చావో రేవో లాంటి నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం ఎలాంటి ప్లాన్ వేయాలి? ప్రచారాంశాలేంటి? అనేదానిపై చర్చించిన పాపాన పోలేదట. ఉపఎన్నిక బాధ్యతలను అప్పగించడం.. నాయకులకు పని విభజన చేయాలన్నదే మర్చిపోయారట. సాగర్ ఉపఎన్నికకుతోడు మరో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ సిద్ధం కావాల్సి ఉంది. ఖమ్మం.. వరంగల్.. నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక పంచాయితీ ఇప్పటికే మొదలైంది. వరంగల్ లాంటి జిల్లాల్లో నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి వెళ్లాయి. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై కాంగ్రెస్‌లో అలికిడి లేదు. 

ఇంఛార్జ్‌ జిల్లా పర్యటనలు కూడా లేవు!

రాష్ట్రంలో ఓవైపు బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తుంటే.. కాంగ్రెస్ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలతోనే సమయం సరిపోతుంది. జిల్లాల్లో ఇంఛార్జ్‌ పర్యటనలు చేసి నాయకులను  సమన్వయం చేయడం లేదని పార్టీలోనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 2023లో అధికారమే టార్గెట్‌ అని చెబుతున్న పార్టీలో ఈ స్తబ్ధత ఏంటన్నది ఎవరికీ అర్థం కావడం లేదట. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సీనియర్‌ నాయకులతో కలిసి ఠాగూర్‌ పనిచేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఆయనే ఈ స్థితి కల్పించుకున్నారో .. పార్టీ నాయకులు సరిగా అర్ధం చేసుకోలేదో కానీ ఇంఛార్జ్‌ సైతం గ్యాప్‌ పాటిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌లో అంతే అన్న నానుడిని మరోసారి రుజువు చేసేలా నాయకుల తీరు ఉందని.. దీనికి ఠాగూర్‌ తీరు  కూడా జతైందని గాంధీభవన్‌ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.