‘మీ నియోజకవర్గం మీద దృష్టి పెట్టండి...

 ‘మీ నియోజకవర్గం మీద దృష్టి పెట్టండి...

మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం డిపాజిట్ చేసిన డబ్బు తిరిగి ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోసం కోర్టు రిజిస్ట్రీ వద్ద కార్తీ ఇంతకు ముందు రూ.10 కోట్లు డిపాజిట్ చేశారు. తాజాగా ఈ సొమ్ము తిరిగి ఇప్పించాలంటూ ఆయన సుప్రీంకోర్టును కోరారు. అది వడ్డీకి తీసుకొచ్చిన డబ్బు అనీ.. ప్రతినెలా వడ్డీ కట్టాల్సి వస్తోందంటూ నివేదించారు. అయితే ఆయన వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. ‘‘మీ నియోజకవర్గం మీద దృష్టి పెట్టండి...’’ అని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది. అక్రమ లావాదేవీల ఆరోపణలపై కార్తీ చిదంబరం సీబీఐ, ఈడీ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు.

ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌, ఐఎన్‌ఎక్స్‌ కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరంపై దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నమెంట్ల కోసం కొద్ది రోజుల పాటు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ ఏడాది జనవరిలో కార్తీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందుకు అనుతినిచ్చిన న్యాయస్థానం.. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో రూ. 10కోట్లు జమ చేయాలని స్పష్టం చేసింది. న్యాయస్థానం సూచనల మేరకు ఆ మొత్తాన్ని చెల్లించి కార్తీ విదేశాలకు వెళ్లారు.

అయితే టెన్నిస్‌ అసోసియేషన్‌ సమావేశాల నిమిత్తం మే, జూన్‌ నెలలో మరోసారి విదేశాలకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని కార్తీ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. మరో రూ.10కోట్లు డిపాజిట్‌ చేసి వెళ్లమని పేర్కొంది. దీనిపై కార్తీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గతంలో ఆయన అప్పుచేసి మరీ రూ. 10కోట్లు చెల్లించారని, దానికి వడ్డీ కూడా కడుతున్నారని చెప్పారు. వీలైనంత త్వరగా ఆ మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు. అయితే ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది.