తొలిసారి మహిళా జవాన్ల రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్

తొలిసారి మహిళా జవాన్ల రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్

భారత సైనిక చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు పురుషులకే పరిమితమైన సైన్యంలోని కొన్ని ఉద్యోగాలకు ఇపుడు మహిళలను ఎంపిక చేయనున్నారు. ఇవాళ్టి నుంచి సైన్యంలోకి మహిళలను రిక్రూట్ చేసుకోవడం ప్రారంభమైంది. మిలిటరీలో యుద్ధంతో సంబంధం లేని విభాగాలలో జవాన్లుగా మహిళలను నియమించేందుకు గురువారం నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కోర్ ఆఫ్ మిలిటరీ పోలీసులోకి నియామకాల కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 8. అంబాల, లక్నో, జబల్‌పూర్‌, బెంగళూరు, షిల్లాంగ్‌ ప్రాంతాల్లో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 1 వ తేదీ 1998 నుండి ఏప్రిల్‌ 1 వ తేదీ 2002 మధ్య పుట్టిన పదో తరగతి పాసైన మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులని అధికారులు తెలిపారు. 

ఈ విభాగం యుద్ధ విధులను నిర్వర్తించదు. వీరిని సోల్జర్ జనరల్ డ్యూటీ అని పిలుస్తారు. ఇంతవరకు సైన్యంలో మహిళలను ఆధికారుల ర్యాంక్ లోనే నియమించే వారు. ఇపుడు జవాన్లుగా కూడా మహిళలను తీసుకోవడం ఇదే మొదటిసారి. సైన్యంలోకి తీసుకున్న మహిళా జవాన్లకు సరిహద్దుల్లో పహారాకు పంపడం లాంటి కఠిన బాధ్యతలు అప్పగించరు. అత్యాచారాలు, దొంగతనాలు, ఇతర కేసులను మహిళా జవాన్లు విచారిస్తారు. పొరుగు దేశాలు కాల్పులతో కవ్వించినప్పుడు సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడం; శరణార్థులను నియంత్రించడం, కార్డన్ సెర్చ్ చేపట్టినప్పుడు మహిళలను తనిఖీ చేయడం వంటి విధులు నిర్వర్తిస్తారు. మిలటరీలోకి సుమారు 800 మంది మహిళలను తీసుకునే వీలుంది. 

మిలిటరీ పోలీస్ లోకి మహిళలను తీసుకోవాలనుకునే ప్రతిపాదనకు జనవరిలోనే రక్షణ శాఖ ఆమోదం పొందింది. సైన్యంలోని మూడు విభాగాలలో కూడా మహిళల ప్రాతినిధ్యం పెంచాలన్న ప్రతిపాదనను చాలా అధ్యయనం తర్వాత ప్రభుత్వం ఆమోదించింది. మహిళ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పదవీ కాలంలో తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయంగా దీన్ని చెప్పవచ్చు.