చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యపై సుప్రీంకోర్ట్ క్షమాపణ కోరిన రాహుల్ గాంధీ

చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యపై సుప్రీంకోర్ట్ క్షమాపణ కోరిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యపై సుప్రీంకోర్టును క్షమాపణ కోరారు. రఫెల్ వ్యవహారంలో సుప్రీంకోర్ట్ తీర్పుపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. రాహుల్ సోమవారం తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి రాహుల్ పై కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. కోర్టును క్షమాపణ కోరుతూ రాహుల్ పిటిషన్ ను రద్దు చేయాలని కోరారు. ఏప్రిల్ 23న కోర్టు నోటీసు జారీ చేస్తూ రాహుల్ గాంధీని సమాధానం ఇవ్వాల్సిందిగా సూచించింది.

కోర్టును రాజకీయాల మధ్యకు తీసుకు రావడం లేదా కోర్టు చెప్పనివాటిని ఉద్దేశపూర్వకంగా చెప్పినట్టు చెప్పడం కానీ తన ఉద్దేశం కాదని రాహుల్ గాంధీ తన తాజా అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీకి ధీటుగా సమాధానం ఇచ్చేందుకే అలా వ్యాఖ్యానించినట్టు చెప్పారు.

ఏప్రిల్ 10న సుప్రీంకోర్ట్ కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలను తోసి పుచ్చింది. భారత సాక్ష్యం చట్టం సెక్షన్ 123 కింద ప్రత్యేకాధికారాలు ఉండే దస్తావేజులను పునర్విచారణ పిటిషన్ కు ఆధారంగా చేయరాదని ప్రభుత్వం వాదించింది. కానీ కోర్టు అలాంటి దస్తావేజుల ఆధారంగా విచారణకు అనుమతి తెలిపింది. రాహుల్ గాంధీ ఈ తీర్పుపై వ్యాఖ్యానిస్తూ చౌకీదార్ చోర్ హై అని అన్నారు.