బీసీసీఐ అధ్యక్ష రేసు... దాదాయే బాస్..!

బీసీసీఐ అధ్యక్ష రేసు... దాదాయే బాస్..!

టీమిండియా మాజీ కెప్టెన్.. భారత జట్టుకు దూకుడు నేర్పిన సౌరవ్ గంగూలీ అలియాస్ దాదా బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది.  బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ ఎన్నిక ఏకగ్రీవంకానుంది.! కార్యదర్శిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తనయుడు జై షా వ్యవహరిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ ధుమాల్‌ బోర్డు ట్రెజరీగా ఎంపిక కానున్నారు. పోటీ లేకుండా ఏకగ్రీవంగా కీలక పదవులు దక్కించుకునేందుకు క్రికెట్‌ వర్గాలు, కేంద్ర రాజకీయ వర్గాల మధ్య గత కొంత కాలంగా సుదీర్ఘ చర్చలు కొనసాగాయి. చివరకు ఈ ఒప్పందం ఖరారైంది. ఈ నెల 23న బోర్డు ఎన్నికలు జరగాల్సి ఉండగా, నామినేషన్ల దాఖలుకు ఇవాళ ఆఖరి తేదీ. 23న బీసీసీఐ వార్షిక సమావేశంలో జరిగే ఎన్నికల్లో ఫలితాలు తేలనున్నాయి. 

మరోవైపు ఢిల్లీలో అమిత్‌ షాను గంగూలీ కలవడంతోనే బోర్డు అధ్యక్షుడి పదవి ఖాయమైనట్లు తెలుస్తోంది. నిజానికి 2021 బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో తనకు మద్దతునివ్వాలని షా కోరినప్పటకీ గంగూలీ హామీ ఇవ్వలేదని తెలిసింది. ఈ క్రమంలో బ్రిజేష్‌ పటేల్‌ పేరు అధ్యక్షుడిగా తెరపైకి వచ్చింది. పలువురి నుంచి బ్రిజేష్ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో గంగూలీకి మార్గం సుగమమైనట్టు క్రీడాపండితులు విశ్లేషిస్తున్నారు.